నగరి : నగరి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ నామినేషన్‌ను పరిశీలనలో భాగంగా అక్రమంగా తొలగించడంపై విచారణ నివేదిక పంపించాలని ఈ నెల 25వ తేదీన ఆదేశాలు జారీ చేసినా బేఖాతర్ చేస్తారా అంటూ మాజీ మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. శనివారం ఈ మేరకు నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాయక్‌ను నిలదీశారు. చైర్‌పర్సన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కమిషనర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ రిపోర్టు ఎందుకు పంపలేదో వివరణ ఇవ్వలని డిమాండ్ చేశారు. 25వ తేదీ తర్వాతే చైర్‌పర్సన్ డిక్లరేషన్ ఇవ్వాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినా ముందస్తుగానే డిక్లరేషన్ ఫారాలు టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థికి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. చైర్‌పర్సన్ అంటూ టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇచ్చిన అధికారులు దానిని నోటీసు బోర్డులో పెట్టకపోవడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఇప్పుడే నోటీసు బోర్డులో డిక్లరేషన్‌ను పెట్టించాలని స్పష్టం చేశారు. దీంతో ఆయన సిబ్బంది ద్వారా డిక్లరేషన్‌ను నోటీసు బోర్డులో పెట్టించారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్నానని, అవి ముగిసిన తర్వాత ఎంక్వయిరీ రిపోర్టును సోమవారం పంపుతానని కమిషనర్ తెలిపారు. దీనిపై మాజీ మంత్రి మాట్లాడుతూ అధికారులు ప్రజాస్వామ్యానికి కట్టుబడి నడుచుకోవాలన్నారు. కలెక్టర్ ఆదేశాలనే పట్టించుకోకుంటే ఇక ఎవరికి స్పందిస్తారని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేసి తిరస్కరణకు గురైన బాలకృష్ణన్ ఈ మేరకు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. తన వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పంపిన ఆదేశాల నకలు తనకు అందిందన్నారు. అయితే ఇప్పటివరకు తనను విచారణకు పిలవలేదని, వాస్తవాలపై తన వాదనను వినిపించే అవకాశం ఇవ్వలేదని తెలిపారు. బాధితుడైన అభ్యర్థిగా తనను విచారణలో పాల్గొనమని ఎందుకు పిలవలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు, సాక్ష్యాధారాలను సమర్పించడానికి అవకాశం ఇచ్చిన తర్వాత, విచారణ జరపాలని కోరారు. తన ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలతో పాటు, విచారణ నివేదిక ఏదైనా ఉంటే దాని కాపీని అందించాలని వినతిపత్రంలో కోరారు. మాజీ మంత్రి ఆర్కేరోజా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి రవీంద్ర సమక్షంలో వినతిపత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు.
వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వినతి


