జిల్లాలోని పలు బ్యాంకుల్లో బంగారం మాయం నాణ్యమైన ఆభరణాలు పెడితే నాసిరకం ఇస్తున్న వైనం రసీదుల్లో తక్కువ బరువు చూపిస్తూ మోసం రెన్యూవల్‌కు వెళ్తే సాకుల తతంగం. రోజులు తరబడి తిప్పుకుంటున్న ఉద్యోగులు లబోదిబోమంటున్న బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు
● చిత్తూరు నగరం గాంధీరోడ్డులోని ఓ బ్యాంకులో అక్కడి అధికారి బంగారు ఆభరణాలను విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని సస్పెన్షన్ వేటు పడింది. రూ. 20లక్షల విలువైన బంగారు ఆభరణం విషయంలో నాణ్యతలేని నగ పెట్టి గోల్మాల్ చేశారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ అధికారిని సస్పెన్షన్ చేశారు. అలాగే కార్వేటినగరంలో కూడా ఓ అధికారి రుణ మంజూరు విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సెప్టెంబర్‌లో ఆ బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
● చిత్తూరు నగరం సాంబయ్యకండ్రిగకు చెందిన శ్రీదేవి (పేరుమార్చాం)అనే మహిళ డీఐ రోడ్డులోని ఓ బ్యాంకులో 2024న బంగారు ఆభరణం పెట్టి రూ.లక్షల రుణం తీసుకున్నారు. క్రమం తప్పకుండా ఏటా రెన్యూవల్ చేయించుకుంటూ వచ్చారు. అయితే కనీసం ఆభరణం కూడా చూపించేవారు కాదు. వారం క్రితం మళ్లీ రెన్యూవల్‌కు వెళ్లినప్పుడు రశీదు చూస్తే గోల్డ్ బరువు తక్కువ ఉంది.. ఆభరణం కూడా మారిపోయింది. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ రెండు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతోంది. బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తోంది. దీంతో ఆమె రీజనల్ బ్యాంకులో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది.
కాణిపాకం : జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన సుమారు 220కి పైగా శాఖలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు దాదాపు 1.50 లక్షల మందికి పైగా వినియోగదారులు తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ, రుణాల మంజూరు, రెన్యూవల్, తిరిగి ఇచ్చే ప్రక్రియల్లో మాత్రం తీవ్ర స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని రుణగ్రహీతలు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన ఆభరణాలను తాకట్టు పెట్టుకుని, తిరిగి ఇచ్చే సమయంలో తక్కువ నాణ్యత కలిగిన బంగారం ఇస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ, నిబంధనలు ఎంతగానో మారాయి. బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టే సమయంలో సదరు ఆభరణాల స్పష్టమైన ఫొటోలను సిస్టమ్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని చాలా బ్యాంకుల్లో ఈ నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. ఫొటోలు అప్లోడ్ చేయకుండా, వివరాలు సరిగా నమోదు చేయకుండా కస్టమర్లను దగా చేస్తున్నారు.
రసీదులు ఇవ్వకుండా వేధింపులు
బంగారు రుణాల రెన్యూవల్‌కు వెళ్లేవారికి బ్యాంకు సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. సకాలంలో ప్రక్రియ పూర్తి చేయకుండా రోజులు తరబడి తిప్పుకుంటున్నారు. ఇందుకోసం సవాలక్ష సాకులు వెతుకుతున్నారు. అంతటితో ఆగకుండా, తాకట్టు పెట్టిన వెంటనే ఇవ్వాల్సిన రసీదులను ఇవ్వడం లేదు. ఈ రోజు కుదరదు.. మరుసటి రోజు లేదా రెండు రోజుల తర్వాత వచ్చి తీసుకోండి అంటూ వేధిస్తున్నారు. తీరా రసీదులు చేతికి ఇచ్చే సమయానికి, వినియోగదారులు తాకట్టు పెట్టిన అసలు బరువు కంటే తక్కువ బరువు నమోదు చేస్తుండడం గమనార్హం.
అత్యవసరమై బ్యాంకుల్లో నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్న వారు ఇక్కట్ల పాలవుతున్నారు. జిల్లాలోని పలు బ్యాంకుల్లో బంగారు రుణాల పేరిట అక్రమాలు సాగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. కష్ట సమయంలో అత్యంత నాణ్యమైన బంగారం కుదువ పెడితే..
విడిపించుకునేప్పుడు నాసిరకం ఆభరణం చేతికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారుల అలసత్వం కారణంగా
వేలాది మంది మోసపోతున్నారని రుణగ్రహీతలు మండిపడుతున్నారు.
ఫిర్యాదులు బుట్టదాఖలు
బ్యాంకు సిబ్బంది గోల్డ్ లెక్కింపుల్లో వ్యత్యాసాలు చూపిస్తూ మోసాలకు పాల్పడుతుండడంతో రుణగ్రహీతలు రగిలిపోతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై బ్యాంకు ఉన్నతాధికారులు, మేనేజర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తూ బాధితులపైనే నెపం నెట్టేందుకు యత్నిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ నియంత్రణ అధికారులు స్పందించి బంగారు రుణాల ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.


