మూగజీవులనే కనికరం కూడా లేకుండా ఏనుగుల నోటి కాడ ముద్దను కొట్టేస్తున్నారు. నాసిరకం ఆహారం అందిస్తూ వాటి ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. మొసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులోని గజరాజులకు మేతను అందించే కాంట్రాక్ట్‌ను టీడీపీకి చెందిన ఓ నేత కుటుంబీకులు చేజిక్కించుకున్నారు. మెనూ ప్రకారం ఆహారం సరఫరా చేయకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పురుగు పట్టిన పెసలు.. రాళ్లు నిండిన ఉలవలు.. పాచిపోయిన కొబ్బరిని అందిస్తూ సొమ్ములు మిగుల్చుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. పైగా టెండర్ గడువు ముగిసినప్పటికీ పాత కాంట్రాక్ట్‌నే కొనసాగిస్తున్నారు.
మొసలిమొడుగు కుంకీ ఎలిఫెంట్
పలమనేరు : నోరులేని జీవులు కదా ఏం చేసినా ఎవరికి చెప్పుకుంటాయనే ధైర్యంతో ఏనుగులకు నాసిరకం ఆహారాన్ని అందిస్తూ దాంట్లోనూ కొందరు మిగిల్చుకుంటున్న వైనం తాజాగా పలమనేరు మండలంలోని మొసలిమడుగు కుంకీ ఎలిఫెంట్‌లో క్యాంపులో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఐదు ఏనుగులున్నాయి. ఇప్పటికే గణేష్, రంజన్, కృష్ణా,, వినాయక ఉండగా, ఇటీవల జగమర్ల వద్ద క్యాప్చరింగ్ చేసిన ఒంటరి ఏనుగు కేశవ కూడా చేరింది. వీటికి రోజూ మెనూ మేరకు అందించాల్సిన పదార్థాలు, వస్తువులను సరఫరా చేసేందుకు గతంలో అటవీశాఖ టెండర్లు పిలిచింది. ఈ టెండర్‌ను టీడీపీకి చెందిన ఓ యువనేత కుటుంబీకుల పేరిట దక్కించుకున్నాడు. ఇటీవల ఈ టెండర్ గడువు ముగిసింది. కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ, దీన్ని పక్కన పెట్టిన అధికారులు పాత కాంట్రాక్టర్ ద్వారానే ఆహార వస్తువులను తీసుకుంటున్నారు. దీంతో వారిచ్చిన నాసిరకం వస్తువులనే ఏనుగులకు ఆహారంగా పెట్టాల్సివస్తోంది. ఇలాగే కొనసాగిస్తే ఏనుగులు అనారోగ్యం బారినపడే ప్రమాదముంది.
నాణ్యత పాటించాలి
ఇప్పటికే టీడీపీ నేత కుటుంబీకుల కాంట్రాక్ట్ కాలం ముగిసింది. దీంతో కొత్తగా మళ్లీ ఈ ఏడాదికి సంబంధించిన టెండర్ పిలవాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో పాత కాంట్రాక్టర్ ద్వారానే వస్తువుల సరఫరా సాగుతోంది. దీంతో సరుకుల నాణ్యతపై అధికారులు ఎవరినీ ప్రశ్నించేందుకు వీలులేని పరిస్థితి. కాంట్రాక్టర్‌ను గట్టిగా మాట్లాడితే తాను సరఫరా చేయనని అంటాడేమోనని అధికారుల భయం. ఏదేమైనా మన జాతి సంపదైన ఏనుగులను కాపాడుకోవాలంటే ఏనుగులపై ప్రేమ, సేవ చేయాలనే తలంపు ఉన్నవారికి టెండర్ కట్టబెట్టాలి. దీనిపై అటవీశాఖ ఉన్నతాధికారులైనా స్పందించాల్సి ఉంది.
ఉలవల్లో రాళ్లు
మెనూ ఇదీ..
రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో ఏనుగుకు 20 పెద్ద ముద్దల సంగటి దాంట్లో ఉలవలు, పెసలను కలిపి పెట్టాలి. దీంతో పాటు వరిగడ్డి కట్టలు, పశుగ్రాసం, రాగి, మర్రి, జువ్వి ఆకులను ఆహారంగా అందించాలి. ఇందుకు సంబందించిన ఆహార పదార్థాలను కాంట్రాక్టర్ తెచ్చి క్యాంపులోని సిబ్బందికి అందజేయాలి. ఆపై రాగిముద్దలు చేయడం, పెడ్డీ గ్రైయిన్స్ చేయడం లాంటి పనులు ఒక్కో ఏనుగుకు ఓ మావటి, ఓ కావడి చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఏనుగుకు ఇద్దరు సిబ్బంది ఉంటారు.


