జనంలో భూసేకరణ భయం
భూముల ఎంపికపై అంతా గోప్యం
పరిశ్రమలు, రహదారులపై లేని ముందస్తు సమాచారం
వివరాలు తెలియక అధికారుల గందరగోళం
ఏ పరిశ్రమ ఎక్కడ వస్తుందో..? ఏ రోడ్డు ఎటు నుంచి వెళుతుందో? ఎవరి భూమి సేకరణలోకి వెళ్లిపోతుందో..? కుప్పం ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. టీకొట్ల నుంచి రచ్చబండల వరకు ఇదే టాపిక్. ఆ ఊరిలో ఫ్యాక్టరీ వస్తుందని ఒకరంటే.. కాదు ఈ గ్రామం వద్ద వస్తుందని మరొకరు. ఆ పల్లె పక్కనే రహదారి వెళుతుందని ఒకరంటే.. కాదు కాదు.. ఈ ఊరి మీదుగా వెళుతుందని మరొకరు. మొత్తం మీద కుప్పంలో అభివృద్ధి సంగతి దేముడెరుగు.. ప్రజలు మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. పోనీ, అధికారులకై నా క్లారిటీ ఉందా అంటే.. అదీ లేదు. భూముల ఎంపిక.. సేకరణ వివరాలు ఏమీ తెలియక యంత్రాంగం సైతం గందరగోళంలో పడిపోయింది.
శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో పెద్ద సంఖ్య లో పరిశ్రమలు వస్తాయని, కొత్తగా పలు రోడ్లు వస్తా యనే చర్చకు ప్రభుత్వం తెరతీసింది. కానీ, ఆయా రోడ్డు లేదా పరిశ్రమ ఎక్కడ? ఎంత విస్తీర్ణంలో వస్తా యనే అంశాలపై అధికార యంత్రాంగం నుంచి ముందస్తు ప్రకటనలు లేకపోయాయి. దీంతో ఎవరికి తోచినట్టు వాళ్లు చేస్తున్న ప్రచారంతో తమ భూములు పోతాయనే అందోళనతో జనం తల్లడిల్లుతున్నారు. కుప్పం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం 2018–19లో దాదాపు 490 ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం సేకరించింది. ఇదే భూమిలో చంద్రబాబునాయుడు సీఎంగా 2019లో విమానాశ్రయానికి భూమి పూజ కూడా చేశారు. కానీ, 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక విమానాశ్రయానికి అదనంగా మరో 1,405 ఎకరాల భూ సేకరణ చేపట్టారు. ఆ భూములే జీవనాధారంగా ఉన్న రైతులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినా, కోర్టులను ఆశ్రయించినా ప్రభుత్వం మొండిగా ముందుకు పోతోంది. భూములు కోల్పోతున్న రైతులు జీవనాధారం కోల్పోతామని గగ్గోలు పెడుతుంటే, ఆ భూ ముల చుట్టూ పొలాలు కొని అక్రమ లే ఔట్లు వేస్తున్న రియల్టర్లు మాత్రం ఎయిర్‌పోర్టు పేరు చెప్పుకుని ప్లాట్లను విక్రయిస్తున్నారు.
భూములు ఇచ్చేందుకు ససేమిరా
ప్రీతిచామనూరు, మాదనపల్లె రెవెన్యూల పరిధిలో పరిశ్రమలకు తమ భూములను ఇవ్వబోమని గత ఏడాది మార్చిలో సర్వేకి వచ్చిన అధికారులను స్థానికు లు అడ్డుకున్నారు. దీంతో ఆ గ్రామానికి చెందిన ఇద్ద రిపై బైండోవర్ కేసులు పెట్టారు. అయినా బెదరని జనం ఆర్‌డీఓను కలిసి భూములు కోల్పోతే బతకలే మని తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. తమ పొట్ట కొట్టకుండా సమీపంలోనే ఉన్న ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు పెట్టాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వేలు చేపట్టే దాకా ఇక్కడి రైతులకు తమ పొలాలు పరిశ్రమలకు తీసుకుంటారనే సమాచారం లేకుండా పోయింది. జూలైలో వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో శాంతిపురం తహసీల్దార్‌ను కలిసి తమ భూములను పరిశ్రమల కోసం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఆ మేరకు వినతి పత్రం అందించారు.
అధికారులకూ తెలియదు
ఎక్కడ ఏ పరిశ్రమ వస్తుందో, ఏ రోడ్డు ఎక్కడ వెళుతుందో అధికారుల వద్ద కూడా సరైన సమాచారం లేని పరిస్థితి. స్థానికులు వేడుకున్నా, బాధిత రైతులు ప్రాధే యపడినా అధికారులు వివరాలు చెప్పలేక పోతున్నా రు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ఏ అధికారిని సంప్రదించినా ఆపై అధికారిని అడగాలనే సమాధానమే వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల బయటే అన్నీ నిర్ణయిస్తున్నారని ఓ అధికారి పెదవి విరిచారు. టీడీపీ నేతలకు తెలిసినంత సమాచారం కూడా తమకు తెలియడం లేదన్నారు. ఏదైనా ప్రజా భాగస్వామ్యంతో ముందుకు పోవాల్సిన అవసరముందని సూచించారు.
జాతీయ రహదారిపైనా దాగుడు మూతలు
పలమనేరు– కృష్ణగిరి జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో తమ ఇళ్లు, భూములు పోతాయని రహదారి పక్కన ఉన్న వారు ఆందోళన చెందారు. ఈ రోడ్డును వెడల్పు చేస్తే గుండిశెట్టిపల్లె వద్ద చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ, కడపల్లె వద్ద నివాసం ప్రహరీలను కూడా కొట్టాల్సి వస్తుందని అంచనాలు వేశారు. కానీ, ఇవేవీ పోకుండా ప్రస్తుతం ఉన్న రోడ్డుకు తూర్పున మరో రోడ్డు వస్తుందని ఇటీవల డ్రోన్ సర్వే నిర్వహించారు. ఇక్కడ భూములు కోల్పోయే రైతులకు ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ రెండు రోడ్లపై ప్రజల సందేహాలు, రైతుల భయాలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తారని, కొత్తగా నిర్మించే రోడ్డును యాక్సెస్ కంట్రోల్ విధానంలో నిర్మించి ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం వినియోగిస్తారని ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేకపోయింది. రోజుకో మార్కింగ్, పూటకో స్కెచ్ చొప్పున లీకులు ఇస్తూ అధికారపార్టీ నేతలు విలువైన భూములను చౌకగా కొంటున్నారనే ఆరోపణ వస్తున్నాయి. నిజంగా ప్రజల కోసమే అభివృద్ధి అయితే, జనాలకు సమాచారం లేకుండా, స్థానికులను భాగస్వాములు చేసుకోకుండా రహస్యంగా ఎందుకు సర్వేలు చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.


