ఓట్ల కోత | - | Sakshi
Sakshi News home page

ఓట్ల కోత

Aug 2 2026 1:28 AM | Updated on Aug 2 2026 1:28 AM

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణలో 1,36,059 ఓట్లు తొలగింపు

జిల్లాలో ప్రస్తుతం 12,04,067 మంది ఓటర్లు

ఈనెల 30 వరకు అభ్యంతరాలకు

అవకాశం

అక్టోబర్‌ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్‌ సమ్మేటివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియ అనంతరం జూలై 31 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించారు. ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో లక్షకు పైగా ఓట్లను తొలగించేశారు. జిల్లా యంత్రాంగం విడుదల చేసిన వివరాల ప్రకారం ఏకంగా 1.36 లక్షలకు పైగా ఓట్లు తొలగిపోవడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల పరిశీలనకు ముసాయితా జాబితాలు అందుబాటులో పెట్టారు.

జిల్లాలో 12,04,067 ఓట్లు

ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటర్ల సవరణ (సర్‌) ప్రక్రియ పూర్తవ్వడంతో జిల్లాలో 12,04,067 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల వివరాలను జూలై 31 న ప్రచురించిన ముసాయిదా జాబితాలో వెల్లడించా రు. 2024 ఎన్నికల నుంచి ఇప్పటికి 1,36,059 మంది ఓటర్లు వివిధ కారణాలతో అందుబాటులో లేరని (ఏఎస్‌డీ) బీఎల్వోలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ధారించారు. ఆచూకీ తెలియని, శాశ్వతంగా వలస, రెండు ప్రాంతాల్లో ఓట్లున్న వారితో పాటు మృతులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ తరహా ఓటర్లలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు.

30 వరకు అభ్యంతరాల స్వీకరణ

ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్‌ 3 వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. జూలై 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఫారం 6 తో కొత్తగా ఓటు పొందేందుకు, మార్పులు చేర్పులకు ఫారం 8 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

23,881 మంది నో మ్యాపింగ్‌

జిల్లాలో సొంత, తల్లిదండ్రుల 2002 నాటి ఓటు వివరాలు సమర్పించకుండానే ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇచ్చిన వారి సంఖ్య జిల్లాలో 23,881 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరినీ నో మ్యాపింగ్‌ కేటగిరీలో పెట్టారు. వీరందరికీ బీఎల్వోలు ప్రస్తుతం నోటీసులు జారీ చేయనున్నారు.

మహిళా ఓటర్లదే పైచేయి

ముసాయిదా ఓటర్ల జాబితాలో పురుష ఓటర్ల కంటే 16,739 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. అత్యధికంగా పలమనేరు నియోజకవర్గంలో 1,22,599 మంది మహిళా ఓటర్లు ఉండగా, అత్యల్పంగా చిత్తూరు నియోజకవర్గంలో 91,256 మంది ఓటర్లున్నారు. మిగిలిన నగరి నియోజకవర్గంలో 94,047, గంగాధరనెల్లూరులో 96,934, పూతలపట్టు లో 1,02,616, కుప్పంలో 1,02,925 మంది మహిళా ఓటర్లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement