పదిహేనేళ్ల క్రితం కట్టుకున్న ఇంటికి నోటీసు ఇప్పించారు అప్పట్లోనే దొంగపట్టా ఇచ్చి రూ.50వేలు నొక్కేశాడు మళ్లీ రూ.5లక్షల కోసం వేధింంపులు ఎక్కడో ఉన్న రమాదేవిని రంగంలో దించాడు వీఆర్వో ద్వారా క్రిష్ణప్పకు తాఖీదు ఇప్పించాడు మనస్తాపానికి గురైన క్రిష్ణప్ప ఆత్మహత్య
పలమనేరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చోటా నాయకులంతా దందాలకు దిగడం, సెటిల్‌మెంట్లు చేయడం ఎక్కువైంది. ఇదే నేపధ్యంలోనే పలమనేరులో బోడిరెడ్డిపల్లికి చెందిన క్రిష్ణప్ప ఆత్మహత్యకు కారణాలను గమనిస్తే దీనికి టీడీపీ నేత శ్రీనివాసులు వేధింపులే కారణమని తెలుస్తోంది. దళితుడైన క్రిష్ణప్ప వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కావడమే ఇందుకు కారణమైందని భావిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం గడ్డూరు కాలనీలో ఇప్పుడు క్రిష్ణప్ప కుటుంబం నిర్మించుకున్న ఇంటికి పట్టా ఇప్పిస్తానని చెప్పి శ్రీనివాసులు రూ.50 వేలు తీసుకున్నాడు. అయితే ఆ ఇల్లు బయటి ప్రాంతానికి చెందిన రమాదేవికి పట్టా కేటాయించగా, ఆమె స్థానికురాలు కాదని అప్పట్లోనే ఆమె పట్టాను రద్దు చేయించింది కూడా శ్రీనివాసులుగా తెలుస్తోంది. ఆపై రమాదేవి ఇక్కడికి రాలేదు. ఈ నేపధ్యంలో తాను రూ.50 వేలిచ్చాను కాబట్టి పట్టా ఇవ్వాలని క్రిష్ణప్ప.. శ్రీనివాసులును అడగడంతో తహసీల్దార్ సీలు, సంతకంతో ఉన్న నకిలీ పట్టాను చేతిలో పెట్టాడు. దీన్ని తీసుకుని కృష్ణప్ప మున్సిపల్ కార్యాలయంలో పన్ను కట్టేందుకు వెళితే అది నకిలీ పట్టాగా తేలింది. దీంతో క్రిష్ణప్ప శ్రీనివాసులును ప్రశ్నించడంతో వివాదానికి కారణమైంది. ఫలితంగా శ్రీనివాసులు ఎక్కడో ఉన్న రమాదేవిని రప్పించి స్థానిక రెవెన్యూ అధికారులకు అర్జీ ఇప్పించాడు. శ్రీనివాసులు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వీఆర్వో పవన్ క్రిష్ణప్పకు గత నెల 27న తాఖీదు ఇచ్చి మూడు రోజుల్లో ఇంటికి సంబంధించిన హక్కు పత్రాలను చూపాలని హెచ్చరించారు. దీంతో క్రిష్ణప్ప ఇదేం అన్యాయమని శ్రీనివాసులను నిలదీయగా అతనిపై దాడికి దిగడమే కాకుండా పెద్దమనుషుల ద్వారా రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో ఇంటిని జేసీబీతో కూల్చేస్తామని హెచ్చరించినట్టు బాధితురాలు అనురాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇచ్చిన గడువు గతనెల 31తో ముగియడంతో జరిగిన అన్యాయం, టీడీపీ నేత బెదిరింపులు, వీఆర్వో నోటీసుపై ఆందోళన చెందిన క్రిష్ణప్ప ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి చూడగా అతని జేబులో తన చావుకు కారణం శీనా అని రాసి పెట్టుకున్న సూసైడ్ నోట్ కూడా లభించింది. దీంతో పాటు శ్రీనివాసులు బెదిరించిన పలు కాల్ రికార్డింగ్స్ మృతుని సెల్‌లో ఉన్నాయి.
ఆత్మహత్య చేసుకున్న క్రిష్ణప్ప (ఫైల్ )
క్రిష్ణప్ప జేబులో దొరికిన సూసైడ్ నోట్


