దైవ సాక్షిగా
వైఎస్సార్‌సీపీ శ్రేణుల ప్రమాణం
టీడీపీ నేతల దొంగ నాటకాలను స్పష్టం చేసేలా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మొదలియార్ విభాగ అధ్యక్షుడు జ్ఞానజగదీష్, రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి గాయత్రిదేవి, జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు హరీషారెడ్డి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి పుష్కరిణిలో మునిగి దైవ సాక్షిగా మీడియా సమక్షంలో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్ వైఖరితో కర్ణాటకలో తలెత్తిన వివాదంతో తమ నాయకుడు ఎంసీ విజయానందరెడ్డికి కానీ, వైఎస్సార్‌సీపీకి కానీ ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు విజయానందరెడ్డి దగ్గర షణ్ముగం అనే వ్యక్తి లక్షలాది రూపాయల డబ్బులు తీసుకున్నది కూడా నిజమేనని ప్రమాణం చేశారు. తాము ధైర్యంగా కోనేరులో మునిగి ప్రమాణం చేస్తుంటే, సవాల్ విసిరిన టీడీపీ నేత షణ్ముగం డ్రామాలు ఆడుతూ అసలు ప్రమాణమే చేయకుండా జారుకున్నారని మండిపడ్డారు. గతంలో టౌన్ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్నప్పుడు నకిలీ బంగారం పెట్టి డబ్బులు కాజేసిన కేసులో సీఐడీ విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్లాడని, నాటి టీడీపీ ప్రభుత్వమే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్లీ పచ్చ చొక్కా వేసుకుని అధికార బలంతో ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టిస్తూ బెదిరించాలని చూస్తే భయపడేది లేదని హెచ్చరించారు. ప్రమాణం ముగించుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు బయటకు వచ్చే సమయంలో టీడీపీ వర్గాలు వారిపైకి దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడగా, పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను సర్దుబాటు చేశారు.
వీఐపీ గేటు ఇరుపార్టీలు చేరుకోవడం ఉద్రిక్తత వాతావరణం
సత్యప్రమాణంలో జ్ఞానజగదీష్, గాయత్రిదేవి, హరీషారెడ్డి
సాక్షి టాస్క్‌ఫోర్స్: దేవుడి సాక్షిగా సత్యం చెప్పే ధైర్యం నిజాయితీపరులకే ఉంటుందని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో శనివారం స్పష్టమైంది. వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డిపై టీడీపీ నేతలు చేసిన అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రమాణం చేసి మరీ తిప్పికొట్టాయి. ఎమ్మెల్యే నోటి దూలతో.. కర్ణాటకకు చెందిన వారు ఆగ్రహించడంలో విజయానందరెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, టీడీపీ విసిరిన సవాల్‌ను స్వీకరించి స్వచ్ఛందంగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు శనివారం కాణిపాకం ఆలయ కోనేరులో మునిగి సత్యప్రమాణం చేశారు. మరోవైపు సవాల్ విసిరిన టీడీపీ నేత షణ్ముగం మాత్రం ప్రమాణానికి ముఖం చాటేసి, లోపలి నుంచి దొంగచాటుగా పారిపోయినట్లు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపించాయి.
కాణిపాకంలో
వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రమాణానికి వస్తున్నారనే విషయం తెలిసి పోలీసులు కాణిపాకంలో శనివారం తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించారు. పార్టీ నాయకులను అడుగడుగునా అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసినా, పోలీసుల అడ్డంకులకు చెక్ పెట్టి వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు కాణిపాకం చేరుకున్నాయి. అదే సమయంలో టీడీపీ వర్గాలకు మాత్రం ఆలయంలోకి సులభంగా వెసులుబాటు కల్పిస్తూ పోలీసులు తీవ్ర పక్షపాత వైఖరి ప్రదర్శించారని, కనీసం మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయలే దని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మా నేత ప్రమాణంకు సిద్ధం.మీరు సిద్ధమా..?
వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆదివారం స్వయంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వచ్చి సత్యప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. ధైర్యముంటే స్థానిక ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్, ఆయన పచ్చ బ్యాచ్ అంతా కలసి కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేయాలని బహిరంగంగా సవాల్ విసిరారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బాబునాయుడు, నాయకులు త్యాగరాజులు, అంజలిరెడ్డి, మనోజ్‌రెడ్డి, ఆను, రజనీకాంత్, స్టాండ్లీ, నారాయణ, అల్తాఫ్, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


