చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో పూర్తి పారదర్శకత పాటించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారులకు సకాలంలో డెలివరీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్యాస్ బుకింగ్, పంపిణీ విషయంలో లబ్ధిదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను డీలర్లు తక్షణమే పరి ష్కరించాలని సూచించారు. గ్యాస్ డెలివరీ సమయంలో భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. నాణ్యతను మరింత మెరుగుపరుస్తూ వినియోగదారుల కు నమ్మకమైన సేవలు అందించాలని కోరారు. ఇన్‌చార్జి డీఎస్‌ఓ లక్ష్మీ పాల్గొన్నారు.
వృద్ధురాలి దారుణ హత్య
తిరుపతి రూరల్: తిరుపతి నగర శివారులోని జయనగర్‌లో మంగళవారం సాయంత్రం వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. కత్తితో కిరాతకంగా పొడిచి ఆమె మెడలోని బంగారు గొలుసు, చెవి పోగులు, చేతి ఉంగరం తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం.. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్‌లో నివాసముంటున్న మల్లెమాల జ్యోతి (65) వంట గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు.
అబ్బాయిని అమెరికాకు పండానికి వెళ్లి!
జ్యోతి కుమారుడు ఉదయ్ బెంగళూరు నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండగా అతనికి వీడ్కోలు పలికేందుకు తండ్రి కృష్ణారెడ్డి ఆదివారం తిరుపతి నుంచి బెంగళూరు వెళ్లారు. జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె ధరించిన బంగారు గొలుసు, కమ్మ లు, ఉంగరాన్ని లాక్కెళ్లారు. దుండగులు ఇంటి బ యట నుంచి తలుపులకు తాళం వేసుకుని వెళ్లడంతో ఆమె మృతి చెందిన విషయం ఎవ్వరికీ తెలియ లేదు.
భర్త ఫోన్‌కు స్పందించకపోవడంతో...
బెంగళూరులో ఉన్న కృష్ణారెడ్డి తన భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోవడంతో తమ పైఅంతస్తులో ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. అదే సమయానికి ఇంటి పని మనిషి కూడా తలుపులు కొడుతున్నా లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇంటి యజమాని వద్ద ఉన్న తాళం తీసుకువచ్చి తెరిచి చూడగా అప్పటికే జ్యోతి రక్తపు మడుగులో పడి ఉంది. మృతురాలి భర్త ఆంధ్ర బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.


