సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబునాయుడు, పచ్చ పత్రికలు తలుచుకుంటే అమెజాన్ అడవులే కాదు.. ఏపీ అంతా ఏసీ చేయిస్తామని చెప్పగల సమర్థులని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో రూ.17.58 కోట్లతో మినీ అమెజాన్ అడవి ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు ఓ పత్రికలో వచ్చిన కథనంపై భూమన స్పందించారు. ఈ విషయంపై మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘అమరావతిలో మినీ అమెజాన్. దట్టమైన అడవి, తుంపర్లుగా కురిసే వర్షం. జలపాతం సవ్వళ్లు, పక్షుల కిలకిలారావాలు, అద్భుతమైన మినీ అమెజాన్ ఐదు ఎకరాల్లో ఏర్పాటు. 20 వేలకు పైగా చెట్లు, మొక్కల ఏర్పాటు. గుబుళ్లతో అడవిని సృష్టిస్తారట. అందులో 400 జాతుల వృక్షాలు, మొక్కలు. బాగా పొడవైన, ఎత్తైన చెట్లు ఉంటాయట. అంతేకాకుండా, ఆ ఐదు ఎకరాల్లో జీవ వైవిధ్య పరిరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతూ, పక్షులు, కీటకాలు, కుందేళ్లు వంటి వన్యప్రాణాల ఆవాస యోగ్యంగా చేయడ మే కాకుండా, చిన్నచిన్న తటాకాలు, సెలయేళ్లను కూడా ఏర్పాటు చేస్తారట’ అని చంద్రబాబు గొప్పత నం గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇంద్రలోకం మాదిరిగా సృష్టిస్తారేమో
అమరావతిలో పసిఫిక్ మహా సముద్రాన్ని, హిమాలయ పర్వతాన్ని, ఇంద్రలోకంలో మాదిరిగా ఇక్కడ కూడా అప్సరసలను ఏర్పాటు చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తారేమోనని భూమన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిగతా ప్రాంతంతో పోలిస్తే అక్కడ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి ఉంటుందంట.. ఐదు ఎకరాల్లో సాక్ష్యాత్తు అమెజాన్ అడవుల్నే అమరావతిలో దించేస్తారట అని ఎద్దేవా చేశారు. ఈ మాయాజాలం చంద్రబాబుకే సాధ్యమన్నారు.
ముందు సౌకర్యాలు కల్పించండి
చంద్రబాబూ.. మీరు ఆలోచిస్తే చాలు.. మీ కాళ్లకు కా దు కదా, మీ చెప్పులకు కూడా భజన చేసే పత్రికలు, చానళ్లు ఉన్నాయి. ఇన్ని గొప్పలు చేయాలంటే మీ వల్లే సాధ్యమవుతుంది. దయచేసి ఆంధ్ర ప్రజల కోసమని రూ.2.5 లక్షల కోట్లతో నిర్మించే అమరావతిలో సౌకర్యాలు కల్పించండి.. అని భూమన సూచించారు.


