శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయం వెలుపల టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ జేఈవో డాక్టర్‌ ఏ.శరత్‌, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement