
మాటలు..బంధానికి బీటలు
వైవాహిక చట్రంలో ఇమడలేకున్న బంధాలు
విడాకుల వైపు వడివడిగా పెరుగుతున్న అడుగులు
విడిపోయాక కలిసి జీవించడంపై యువతరం ఆసక్తి
స్వేచ్ఛ.. స్వాతంత్రం పేరిట నూతన
బంధాలకు బాటలు
జిల్లాకు పాకిన మహానగరాల సంస్కృతి
ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు నమోదైన విడాకుల కేసులు
అ..అతడు.. ఆ.. ఆమె.. ఇద్దరూ పక్కపక్కనే ఉండే అక్షరాలు. నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన ఆలుమగలు. ఒకరికొకరం అనుకుంటూ ముందుకు నడవాల్సిన వారి మధ్య దూరం పెరుగుతోంది. కలిసి నడవాల్సిన పాదాలు తడబడుతున్నాయి. సర్దుకుపోలేమంటూ విడిపోయేందుకు సిద్ధపడుతున్నారు. మనస్సును మరింతగా మురిపించాల్సిన గిల్లికజ్జాల స్థానంలో అనుమానపు బీజాలు పడుతున్నాయి. చిలిపి చేష్టలు..అల్లరిగా గడపాల్సిన భార్యభర్తలు తమ జీవితాలను అల్లరిపాలు చేసుకుంటున్నారు. పని ఒత్తిడిలో మాటలు దూరమై.. కాపురాలు కాలదన్నుకునేంతవరకు వెళుతున్నారు. సరిదిద్దే పెద్దలు లేక ఎడముఖం..పెడముఖంగా సాగుతున్నారు. చివరకు ఈ కాపురం మావల్ల కాదంటూ విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు.
చిత్తూరు అర్బన్: పెళ్లంటే.. ప్రీ వెడ్డింట్ షూట్. ఎంగేజ్‌మెంట్ షూట్. బ్యాచ్‌లర్ పార్టీ. సంగీత్, మెహందీ.. ఆకాశమంత పందిరి.. మేళ తాళాలు. మూడుముళ్లు. మరి ఆ మూడు ముళ్లు పడిన మూడు నెలల తరువాత..? విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం. ఎంత వైభవంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయో.. అంతే తొందరగా విడాకులకు సైతం ఉబలాట పడుతున్నారు. విడిపోయాక.. అదే జంట వాళ్లతోనే ప్రేమలో కూడా పడుతున్నారు. ఒకప్పుడు మహానగరాల్లో మాత్రమే కనిపిస్తున్న ఈ పోకడ.. ఇప్పుడు చిత్తూరు లాంటి నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది.
అర్థం కావడంలేదు
ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతరానికి వైవాహిక బంధం అంత సులువుగా అర్థం కావడంలేదు. ప్రేమ, పెళ్లి వరకు ఉంటున్న ఆసక్తి.. పెళ్లి తరువాత కొనసాగనంటోంది. ప్రేమికులుగా ఉన్నపుడు బాధ్యత ఉండదు. మూడుముళ్లు పడేటప్పుడు వర్ణించడానికి వీలుకాని మధుర క్షణాలు.. అటు తరువాత నిలకడగా ఉండడంలేదు. దీనికి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమేనని మానసిక వైద్య నిపుణులు, మధ్యవర్తిత్వం చేసే కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు. పెళ్లయిన కొత్త జంటలో ఒకరు ఉద్యోగం చేస్తుంటే, మరొకరు ఇంట్లో ఒంటరిగా ఉండలేక.. కుటుంబ సభ్యులతో మనస్తత్వం కలవక.. విడాకులవైపు అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగులైతే ఇక్కడ కూడా చాలా జంటల్లో సమస్య తలెత్తుతోంది. ఇంటి పనుల్లో ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోవడం, పనిచేసే ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడి, సమస్యలు భాగస్వామిపై చూపించేసి.. ఇక కలిసి ఉండలేమని నెలల్లోనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఒక్క చిత్తూరు నగరంలోనే గత ఎనిమిది నెలల్లో 183 మంది విడాకుల కోసం కోర్టు మెట్లక్కారు. ఇందులో పెళ్లయిన సంవత్సరంలోపు విడాకుల కోరుకుంటున్న వారి సంఖ్య 32 శాతం ఉండడం వివాహ బంధంపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తోంది.
విడిపోయి ఒక్కటిగా..!
చిత్తూరు నగరానికి చెందిన శుభ ప్రభుత్వ ఉద్యోగి. భర్త లలిత్ అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్.. రెండేళ్లపాటు సాగిన వీళ్ల దాంపత్యానికి ఇటీవల గుడ్‌బై చెప్పి, విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న మూడు నెలల తరువాత తరచూ ఈ జంట కలుస్తుండడం, సినిమాలు, షాపింగ్‌లకు వెళ్లడం.. అటు తరువాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోవడం. ఇటీవల ట్రెండ్‌లోకి వచ్చిన ఈ పద్ధతులను క్యాజువల్, నాన్–కమిటెడ్ రిలేషన్, వన్‌నైట్ స్టాండ్, షార్ట్‌టెర్మ్, లో–ఇంటిమెసీ రిలేషన్‌షిప్ లాంటి రకరకాల సహ జీవన విధానాలు సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ తెలుస్తున్నాయి. పెళ్లి లాంటి బంధాలకన్నా.. మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతూ, తమకు కావాల్సిన బంధాలను కొనసాగిస్తున్నారు.
మావిడాకులు వాడేలోపే విడాకులు
ప్రాంతం విడాకుల కేసులు
చిత్తూరు 183
తిరుపతి 192
పలమనేరు 118
పుంగనూరు 41
పుత్తూరు 56
శ్రీకాళహస్తి 69
పీలేరు 91
విడగొడుతున్న ‘సెల్’ భూతం
దంపతులు విడిపోతుండటానికి ప్రధాన కారణం మాత్రం సెల్‌ఫోన్‌గా తెలుస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలు అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలో గడుపుతుండడం, తన భాగస్వామిని పట్టించుకోకుండా ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం, కొందరు అవధుల్లేని విశృంఖల కోరికలు కోరడం లాంటివి అవతలి వ్యక్తికి జీవితంపై విరక్తి పుట్టిస్తోంది. ఇటీవల చిత్తూరు పోలీసుల వద్దకు కౌన్సెలింగ్‌కు వచ్చిన ఓ జంట ‘మాకు పెళ్లయ్యి 38 రోజులయ్యింది. నా భర్త వేకువజామున 3 గంటల వరకు కూడా పబ్జీ ఆడుకుంటున్నాడు. ఒక రోజు, రెండు రోజులు.. కానీ ప్రతిరోజూ ఇదే తంతు. ఇతనితో కలిసి ఉండడం నావల్ల కాదు..’ అంటూ 22 ఏళ్ల యువతి తన ఆవేదనను వ్యక్తం చేయడం అక్కడున్న కౌన్సెలర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పడకగదిలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడం తమ ప్రేమానురాగాలు, దాంపత్యజీవితాన్ని మూడో వ్యక్తికి చూపించడమే అవుతుందని చాలా మందికి అర్థం కావడంలేదు.