
పంటలపై ఆగని గజదాడులు
పలమనేరు: కుంకీ ఏనుగులతో అడవిలోని ఏనుగులు పంటలపైకి రాకుండా కట్టడి చేస్తామంటూ స్థానిక ఫారెస్ట్ అధికారులు ఎన్ని మాటలు చెబుతున్నా రైతుల సాగు చేసిన పంటలకు ఏనుగులు నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి నూనేవారిపల్లి సమీపంలోని పలువురు రైతులకు చెందిన వరి పంటను ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. ముఖ్యంగా ఒంటరి ఏనుగు తరచూ పంటలపై ఎక్కువగా పడుతోందని ఆ గ్రామస్తులు తెలిపారు. కౌండిన్య అడవిలో నుంచి ఏనుగులు పొలాల్లోకి రాకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పులిచెర్ల మండలంలో..
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని చల్లావారిపల్లె సమీపంలోని పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసి పంటలను నాశనం చేశాయి. వారం రోజులుగా చుట్టు పక్కలా ఎక్కడా కనిపించని ఏనుగులు మళ్లీ శనివారం తెల్లవారుజామున రామచంద్ర పొలంలో సాగు చేసిన వేరుశనగ, రాగి పంటలను తొక్కి, పీకి నాశనం చేశాయి. మామిడితోట కంచెగా ఉన్న కలబందను తొక్కేశాయి. పంట చేతి కొచ్చే సమయంలో ఇలా నాశనం చేయడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. దాదాపు ఐదు ఏనుగుల గుంపు చల్లావారిపల్లె పరిసర ప్రాంతాల్లోని పంటలపై పడి నాశనం చేశాయి.

పంటలపై ఆగని గజదాడులు