
బాధితులకు అండగా నిలబడుతాం
న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం దళితులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
శ్రీరంగరాజపురం : అగ్రవర్ణాలకు చెందిన కూటమి నాయకుల దాడుల్లో గాయపడిన వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మండల కేంద్రంలోని ఎర్రకొంటపై దళితుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిపై కూటమికి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ఇంటి స్థలం లేని నిరుపేద దళితులు ఎర్రకొంటపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారన్నారు. చర్చి ఉంటున్న స్థలంలోనే తమకు శ్మశానం కావాలంటూ అగ్రవర్ణాలకు చెందిన కూటమి నాయకులు దళితుల ఇళ్లపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ, మైనారీటీ, బీసీ వర్గాలు చెందిన వారికి రక్షణ కరువైందన్నారు. దళితులపై దాడులు చేసిన వారిపై పోలీసులు ఇంత వరకూ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. దళితులకు న్యాయం చేసే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.
దళితుల భుమిలో పరిశ్రమలా : మండలంలోని పాతపాళ్యం దళితవాడకు చెందిన కొంత మంది వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం 56 కానికపురం రెవెన్యూలో తాను సమితి అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి నేటి వరకు దాదాపు 50 వేల ఎకరాలు అర్హులైన వారికి డీకేటీ పట్టాలు మంజూరు చేశామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని వారి భూములను బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. దళితుల భూములకు ఆనుకొని వందల ఎకరాలు ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన భూములును తీసుకోవాలన్నారు. బలవంతంగా భూములు తీసుకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు మణి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాలప్ప, ఉమ్మడి జిల్లా క్రియాశీలక కార్యదర్శి కుప్పయ్య, ఎంపీపీ సరిత జనార్దన్, స్థానిక సర్పంచ్ హరిత, మణి, శ్యామ్ పాల్గొన్నారు.
దళితులపై దాడులు చేస్తే ప్రశ్నించరా..?
కూటమి ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ఎమ్మెల్యే, మంత్రులు, ఎమ్మెల్సీ, ఎంపీలు వివిధ రంగాల్లో ప్రజా ప్రతినిధులుగా ఉన్నా దళితులపై దాడులు చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గెలవడానికి దళితులు ఓట్లు కావాలి, కానీ దళితులు అభివృద్ధి చెందకూడదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువగా దళితులపై దాడులు జరుగుతున్నాయని నారాయణస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులపై (జాతీయ,రాష్ట్ర) ఎస్సీ , ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఈ కేసును సుమోటాగా స్వీకరించాలన్నారు.