
శేషవాహనంపై ‘విఘ్న’ విహారం
కాణిపాకం : వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ చిన్న, పెద్ద శేషవాహన సేవల్లో విహరించారు. వాహన సేవల్లో విహరించిన విఘ్నేశ్వరుడుని అశేష భక్తజనం దర్శించి పునీతులయ్యారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సిద్ధి, బుద్ధి, సమేత వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ చిన్న, పెద్ద శేష వాహనంపై అభయమిచ్చారు. అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత గౌరీ సుతుడికి విశేషాలంకరణ చేసి చిన్న శేష వాహనంలో కొలువుదీర్చారు. మేళతాళాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పురవీధుల్లో వేడుకగా ఊరేగించారు.
రాత్రి స్వర్ణ పెద్ద వాహనంలో కనువిందు
ఉభయకర్తలు, ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వర్ణ పెద్ద శేష వాహనంలో కొలువుదీర్చారు. కోలాటాలు, చెక్క భజనల నడుమ పెద్ద శేష వాహన సేవ చేపట్టారు. కమ్మ సామాజిక వర్గీయులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
నేడు చిలుక, వృషభ వాహన సేవ
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సోమవారం చిలుక, వృషభ వాహన సేవల్లో స్వామి వారు దర్శనమివ్వనున్నారని ఆలయ ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం చిలుక వాహన సేవ, రాత్రి వృషభ వాహన సేవ ఉంటుందన్నారు. ఈ సేవకు ఉభయదారులుగా కాణిపాకం ఆర్యవైశ్యులు, కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లి, ముదిగోళం, చిత్తూరు, శాలివాహన వంశస్థులు వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.

శేషవాహనంపై ‘విఘ్న’ విహారం

శేషవాహనంపై ‘విఘ్న’ విహారం