
అయ్యో..వినాయకా!
● గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి ● చెరువులో మునిగి ఇద్దురు యువకులు మృతి ● చిన్నమనాయనిపల్లిలో తీవ్ర విషాదం
గంగవరం: కోలాహలం మధ్య గణేష్ నిమజ్జనాన్ని పూర్తిచేశారు. డప్పు వాయిద్యాల నడుమ చిందులేస్తూ చెరువు వద్దకు విగ్రహాన్ని తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసి తిరిగి సంతోషంగా ఇంటికెళ్లారు. తీరా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కనిపించకపోవడంతో మళ్లీ చెరువు వద్దకు వచ్చి వెతుకులాట ప్రారంభించారు. విగ్రహం కింద పడి ఆ ఇద్దరూ ప్రాణాలొదలడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అయ్యో.. వినాయకా! కాపాడలేకపోయావా నాయనా..? అంటూ గుండెలు బాదుకుంటూ రోదించడం అక్కడి వారిని కలచివేసింది. ఈ ఘటన గంగవరం మండలం, చిన్నమనాయనిపల్లిలో ఆదివారం రాత్రి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. మండలంలోని మేలుమాయి పంచాయతీ, చిన్నమనాయనిపల్లి గ్రామంలో కొలువుదీర్చిన వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పటికే రాత్రి పడింది. అక్కడ నిమజ్జనం కోసం కొందరు విగ్రహాన్ని చెరువులోకి తీసుకెళ్లారు. వారిలో అదే గ్రామానికి చెందిన బుజ్జమ్మ కుమారుడు భార్గవ్(28), సాలప్ప కొడుకు చరణ్(27) కూడా ఉన్నారు. నిమజ్జనం అనంతరం అందురూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఆ ఇద్దురు యువకులు ఇళ్లకు రాకపోవడంతో అనుమానం వచ్చి గ్రామస్తులు తిరిగి చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. నీటిలో మునిగిపోయిన విగ్రహాన్ని తాళ్లు కట్టి పైకి తేల్చారు. విగ్రహం కింది భాగాన భార్గవ్, చరణ్ ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోవడాన్ని గుర్తించి బోరున విలపించారు. ఆపై మృతదేహాలను నీటి నుంచి వెలికి తీసి ఇళ్లకు చేర్చారు. మృతుడు భార్గవ్ గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం టైల్స్ వేసే పనికి వెళ్తాడు. చరణ్ ఇటుకుల బట్టీలో పనిచేస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

అయ్యో..వినాయకా!