
జానపద కళలను కాపాడుకుందాం
చిత్తూరు కలెక్టరేట్ : పల్లె ప్రజలు నవజీవన చైతన్యానికి ప్రతి రూపాలని మన సంస్కృతి కళా సంస్థ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సహదేవనాయుడు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విజయం విద్యాసంస్థల్లో ఆ సంఘం కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న జానపద మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 1వ తేదీ నుంచి జానపద మాసోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. నేటి తరం విద్యార్థులకు జానపద కళల గొప్పదనం వివరించినట్లు తెలిపారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన రచయిత్రి అరుణకుమారి మాట్లాడుతూ.. పల్లె పదాలు, జానపద కళలు, పాటలు, పల్లె ప్రజల శ్రమ గొప్పదన్నారు. తోలుబొమ్మలాటలు, చెక్కభజనలు, ఒగ్గు కథలు, హరికథలు, వీధి నాటకాలను ప్రదర్శించి వినోదం కల్పించేవారన్నారు. జానపద కళలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. అనంతరం పలువురు గాయకులను సత్కరించారు. ముగింపు కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి కలకట రెడ్డెప్ప, గాయకులు శ్రీరంజని, లత, నరసింహులు, అనంత్‌కుమార్, చిరంజీవి, మనోహర్ పాల్గొన్నారు.