
సర్వం సన్నద్ధం
సాక్షి ముఖాముఖిలో ఈఓ పెంచల కిషోర్
వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆలయాధికారులు సన్నద్ధమయ్యారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే ఏర్పాట్లపై ఆలయ ఈఓ పెంచల కిషోర్ సాక్షి ముఖాముఖిలో పలు విషయాలను పంచుకున్నారు. ఆయన మాటాల్లోనే.. – కాణిపాకం
ఈ నెల 27 నుంచి సెప్టంబర్ 16వ తేదీ వరకు వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు, నిర్వహణ పనులు జరుగుతున్నాయి.
వినాయక చవితి, రథోత్సవం, కల్పవృక్ష వా హనం, తెప్పోత్సవం, పుష్పవల్లకి రోజుల్లో సుమారు 70 వేల నుంచి 80 వేల మంది భక్తు లు, మిగిలిన రోజుల్లో 40 వేల మంది భక్తులు వస్తారని అంచనా. ఉత్సవాల సందర్భంగా అర్జిత సేవలు రద్దు చేశాం. దర్శన సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నాం.
వాహనాల పార్కింగ్‌కు కాణిపాకం బస్టాండ్ పక్కన ఉన్న ప్రాంతం, కొబ్బరితోట, ఈఓ కాంప్లెక్స్ పక్కన స్థలాలను కేటాయించాం. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
ప్రధానంగా నిఘా వ్యవస్థ పటిష్టంగా పనిచేయనుంది. ప్రత్యేక రోజుల్లో 200 మంది పోలీసులతో బందోబస్తు ఉంటుంది. సాధారణ రోజుల్లో 100 మంది వరకు పోలీసులుంటారు. ఈ సారి సీసీ కెమెరాలతోపాటు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టేలా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ బృందం 500 మందితోపాటు మరో 50 మంది సిబ్బందిని అదనంగా తీసుకుంటున్నాం. అన్నదానానికి 20 మంది అవసరమవుతోంది. సేవకులుగా పనిచేసేందుకు 500 మంది రిజి స్ట్రేషన్ చేసుకున్నారు. అవసరం ఆధారంగా వారిలో 100 మంది వరకు తీసుకుంటాం.
ఆలయ పరిసర ప్రాంతంలో మెడికల్ క్యాంపు జరుగుతుంది. మూడు షిప్టులలో వైద్యులు పనిచేయనున్నారు. ఇద్దరు పీహెచ్‌సీ డాక్టర్లతోపాటు ఆరుగురు స్పెషలిస్టు డాక్టర్లు ఉండేలా ఆదేశాలున్నాయి. దీంతో పాటు 10 మంది వరకు వైద్య సిబ్బంది క్యాంపులో ఉంటారు.
అర్‌అండ్ బీ అధికారులు పట్నం నుంచి కాణిపాకం వరకు వచ్చే రోడ్డును అభివృద్ధి చేశారు. తిరువన్నంపల్లి రోడ్డును కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.
పంచాయతీ శాఖ అధికారులు పారిశుద్ధ్య పనులు, తాగునీటి వసతి కల్పిస్తారు. పారిశుద్ధ్య సామగ్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు.
విద్యుత్ శాఖ ఏడీ, ఏఈలు అందుబాటులో ఉండనున్నారు. పవర్ కట్ సమయంలో పవర్ జనరేటర్‌ను వాడుకుంటాం. విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటాం.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతోపాటు ఉభయదారులు, కాణిపాకవాసులు సహకరించాలని ఆయన కోరారు.