
ఫేక్ సర్టిఫికెట్లపై డేగ కన్ను
చిత్తూరు కలెక్టరేట్: ఫేక్ సర్టిఫికెట్లపై అధికారులు డేగ కన్ను వేశారు. మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థుల్లో చాలా వరకు ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్టు విద్యాశాఖ అధికారులకు ముందస్తు సమాచారం వెళ్లింది. ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఎంపికై న అభ్యర్థుల ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు ఈనెల 28న చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న అపోలో యూనివర్సిటీ, ఆర్‌వీఎస్ నగర్‌లో ఉన్న ఎస్వీ సెట్‌లో సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఎంపికై న అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లకు ఈనెల 26 నుంచి కాల్‌లెటర్లను పంపారు.
నకిలీ అయితే క్రిమినల్ కేసే
అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లను సమర్పిస్తే సంబంధిత అభ్యర్థిపై క్రిమినల్ కేస్ నమోదు చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సూచించిన సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండవన్నారు. ఒరిజనల్ సర్టిఫికెట్లు లేకపోయినా...అభ్యర్థులు పరిశీలనకు గైర్హాజరైనా ఉద్యోగం లేనట్టేనని స్పష్టం చేస్తున్నారు. దివ్యాంగులు, క్రీడా కోటా అభ్యర్థుల సర్టిఫికెట్‌లను రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో పరిశీలన చేయనున్నారు. సర్టిఫికెట్ కేంద్రాల్లో అభ్యర్థులకు తప్ప మిగిలిన వ్యక్తులకు, మీడియాకు అనుమతి లేదని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు.
తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు ఇవే
అభ్యర్థులకు పంపిన కాల్‌లెటర్ కాపీ
సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు
ఇటీవల జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం (వర్తించినచో).
అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం (వర్తించినచో).
కాల్‌లెటర్‌లో సూచించిన ఇతర సర్టిఫికెట్లు
గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు
5 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు