
● నేటి నుంచి కాణిపాక వార్షిక బ్రహ్మోత్సవాలు ● శోభాయమానం
కాణిపాకం: కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బుధవారంతో చవితి ప్రారంభమై సెప్టెంబర్ 16తో ఈ ఉత్సవం ముగియనుంది. నెల రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సా గాయి. ఆలయ క్షేత్రాన్ని శోభయమానంగా తీర్చిదిద్దారు. భక్తుల వసతికి లోటూ లేకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. క్యూలను విస్తరించారు. ఉచిత, శ్రీఘ్ర, అతిశ్రీఘ్ర దర్శనాల క్యూలను పెంచారు. మరింత మందికి అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేపట్టారు. ముందస్తు రద్దీ దృష్ట్యా ప్రసాద విక్రయ కేంద్రం వద్ద కూడా క్యూలైన్లు పెట్టారు. మరమ్మతు పనులను పూర్తి చేశారు. ఆలయానికి రంగులు అద్ది.. కొత్త కళను తీసుకొచ్చారు. రథం, వాహనాలకు సైతం రంగులు వేశారు. అలాగే రంగువల్లులు వేసి వాటికి పెయింటింగ్ వేసి ఆకట్టుకునేలా చేశారు. ఇటూ చిత్తూరు నుంచి..అటు తిరుపతి మార్గం నుంచి స్వాగతం పలుకుతూ రోడ్డుకు ఇరువైపులా స్వాగత కటౌట్లను కట్టారు. మరమ్మతులకు గురైన పట్నంరోడ్డును బాగుచేయించారు.
హోమపూజలు, పార్కింగ్
ఆలయ ఆవరణలో హోమ, యజ్ఞ పూజలు సైతం నిర్వహించేందుకు ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్‌ను ముందస్తుగానే గుర్తించి.. మూడు చోట్ల పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. గణేష్ సేవాసదన్ భవనానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో బస్సులు, పెద్దపెద్ద వాహనాలు నిలిచేందుకు అనువుగా స్థలాన్ని కేటాయించారు. బస్టాండు ఆనుకుని ఉన్న స్థంలో ఆటోలు, కార్లు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేపట్టారు. ఈవో నివాస భవనం వెనుక భాగంలో కూడా పార్కింగ్‌కు సిద్ధం చేశారు.
అంతరాలయ దర్శనం రద్దు
చవితిని పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో బుధవారం అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉదయం నుంచి రాత్రి 10గంటల వరకు స్వామి దర్శనం ఉంటుందన్నారు.
బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దాం
కాణిపాకం: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు అధికారులు ఆదేశించారు. కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై కాణిపాకం ఆలయ ఈఓ కార్యాలయ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, బుధవారం నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్డీఓ, డీఎస్పీ, ఆలయ ఈవో ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24/7 కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఈఓ పెంచలకిషోర్, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎంఅండ్‌హెచ్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

● నేటి నుంచి కాణిపాక వార్షిక బ్రహ్మోత్సవాలు ● శోభాయమానం