
కుప్పంలో కస్సు.. బస్సు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కుప్పంలో మహిళలకు ఉచిత బస్సు పథకం తూతూమంత్రంగా సాగుతోంది. ఉచితానికి అర్హత ఉన్న 27 బస్సులను అంతర్రాష్ట్ర సర్వీసులుగా తిప్పుతున్నారు. ఇక పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను సైతం తమిళనాడు చుట్టూ తిరిగొస్తున్నాయి. దీంతో ఉచిత ప్రయాణం రోజువారీగా 31శాతం దాటడం లేదని అధికారులు గణాంకాలు కట్టారు. ఈ అరకొర సేవలపై మహిళలు మండిపడుతున్నారు. దీనికితోడు బెంగళూరుకు జీరో సర్వీసులంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుప్పం పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి ఈ అరకొర సేవలపై స్పందించాలని మహిళలు కోరుతున్నారు.
జిల్లాలో మొత్తం ఐదు డిపోలున్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం అద్దె బస్సులతో కలిపి 461 సర్వీసులు నడుస్తున్నాయి. అయితే చిత్తూరు–2డిపో తర్వాత కుప్పం డిపోకే అధిక సర్వీసులున్నాయి. ఆ డిపోలోనే అత్యధికంగా ఉచిత బస్సులకు కోతలు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా సీ్త్రశక్తి పథకానికి 339 బస్సులు అర్హత ఉంటే .. వీటిల్లో 75 వరకు అంతర్రాష్ట్ర సర్వీసులుగా తిరుగుతున్నాయి.
కోతలు ఇలా!
కుప్పం డిపో పరిధిలో మొత్తం 100 సర్వీసులున్నాయి. ఇందులో పల్లెవెలుగు 59, ఎక్స్‌ప్రెస్16, సప్తగిరి 17, సూపర్‌లగ్జరీ 8 సర్వీసులున్నాయి. ఇందులో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 75 దాకా ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు మహిళలకు అర్హత ఉన్నా... 27 సర్వీసులను అంతరాష్ట్ర సర్వీసులంటూ తిప్పుతున్నారు. ఇందుల్లో పల్లెవెలుగు సర్వీసులు 25, ఎక్స్‌ప్రెస్ 2వరకు ఉన్నాయి. వీటిని కేజీఎఫ్, క్రిష్టగిరి, తిరపత్తూరు, వాణియంబడి, వేలూరుకు నడిపిస్తున్నారు. ఈ కారణంగా 100 బస్సుల్లో ఉచితానికి 48 బస్సులు మాత్రమే మిగిలాయి. దీనికితోడు తిరుపతి, చిత్తూరు మీదుగా కుప్పంకు 39 సర్వీసులుటే ఇందులో కేవలం 14 సర్వీసులు మాత్రమే ఉచితమంటున్నారు. ఇక చిత్తూరు–2డిపో పరిధిలో 79 బస్సులకు అర్హత ఉంటే 27 సర్వీసులు అంతర్రాష్ట్ర సర్వీసులంటూ చేతులెత్తేశారు.
కుప్పం– బెంగళూరుకు బస్సు ఏదీ?
కుప్పం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో బెంగళూరుకు వలస వెళుతుంటారు. అక్కడ ఉపాధి చేస్తూ...కుప్పంలో జీవనం గడుపుతున్నారు. ఇలాంటి వారికి ఆర్టీసీ ప్రయాణం ఆమాడదూరంలో ఉంది. కేజీఎఫ్ వరకు మాత్రమే రెండు సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేక కుప్పం వాసులు నరకం అనుభవిస్తున్నారు.
డిపో అర్హత ఉన్న అంతర్రాష్ట్రల
సర్వీసులు సర్వీసులు
(పల్లెవెలుగు,ఎక్స్‌ప్రెస్) (పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్)
చిత్తూరు 165 17
చిత్తూరు 279 27
పలమనేరు 57 5
పుంగనూరు 63 5
కుప్పం 75 27