
రండి బాబూ రండి.. నేడే ఆఖరు!
చిత్తూరు అర్బన్: జిల్లాలో మద్యం బార్ల నిర్వహణ కోసం లైసెన్సులు జారీ చేయడానికి అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్‌పై వ్యాపారుల్లో స్పందన కరువైంది. గతవారం నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. మంగళవారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగియనుంది. ఈ క్రమంలో బార్ల నోటిఫికేషన్ గడువును పొడిగించడం తప్ప.. ప్రభుత్వం వద్ద మరో మార్గం లేదని వ్యాపారాలు చెబుతున్నారు.
ఇషారాజ్యమే కారణమా?
జిల్లాలో 2025–28 సంవత్సరానికి మొత్తం మూడేళ్ల పాటు మద్యం బార్లను నిర్వహించడానికి ప్రభుత్వం గత వారం నోటిఫికేషన్ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో 10 మద్యం బార్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి మించిన పాలసీ ఎప్పుడూ చూడలేదని, ఇదే ఉత్తమ పాలసీ అంటూ ఎకై ్సజ్ అధికారులు ఊదరగొట్టారు. మరి ఇంతటి ఉత్తమ పాలసీకి ఆఖరు తేదీ వస్తున్నా, ఎందుకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ప్రశ్నిస్తే.. మౌనమే సమాధానం. మద్యం దుకాణంతో పోలిస్తే బార్‌కు లైసెన్సు ఫీజు తక్కువే. లాభాలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఇదే సమయంలో బార్ నిర్వహణ, రెస్టారెంట్, పనిచేసే వాళ్ల సంఖ్య, ఇతర ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే బార్లు నిర్వహిస్తున్న వాళ్లు చెబుతున్నారు. ఇది కాకుండా ప్రతీ బార్ కోసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామని షరతు పెట్టడం, ఒక్కో దరఖాస్తుకు నాన్–రీఫండబుల్ ఫీజు రూపంలో రూ.5.1 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉండడం లాంటివి బార్ పాలసీని నీరుగారుస్తున్నాయి. ఇక మద్యం బార్ పెట్టే ప్రతీచోటా స్థానిక ప్రజాప్రతినిధులకు నెలవారీ మామూళ్లు 4 శాతం ఇవ్వాలని ఇప్పటికే పచ్చ నేతలు తీర్మానం చేశారు. ఇంత మొత్తం ఖర్చుపెట్టుకుని, పెట్టుబడి కూడా రాకుంటే వ్యాపారం చేయడం కష్టమని చాలా మంది బార్ పాలసీపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
స్పందన లేదాయె!
చిత్తూరు నగరంలో ఏడు, పుంగనూరు, పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీల్లో ఒక్కో బార్‌కు దరఖాస్తులు పిలిచినా అధికారులకు ఆశాభంగం తప్పలేదు. 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 28న లాటరీ పద్ధతిలో లైసెన్సు దారుడిని ఎంపికచేస్తామని చెప్పారు. కానీ గడువు దగ్గరకు వచ్చేస్తున్నా ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తుకు ముందు ఆసక్తి ఉన్న వాళ్లు పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటారు. జిల్లాలో కేవలం 11 మంది మాత్రమే పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు వస్తేనే, లైసెన్సు ప్రిక్రయ కోసం లాటరీ పద్ధతి నిర్వహిస్తారు. లేకుంటే మొత్తం ప్రక్రియ వాయిదా వేయాల్సి ఉంది.
గడువు పెంచుతారా?
బార్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును పెంచుతారని ప్రాథమికంగా తెలుస్తోంది. కల్లుగీత సామాజికవర్గానికి చిత్తూరు నగరంలో ఒక బారు రిజర్వు చేయడం, దానికి 50 శాతం లైసెన్సు ఫీజు రాయితీతో 28 తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. 30న లాటరీ నిర్వహిస్తారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. 28వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు పెంచి, 30న లాటరీ నిర్వహించడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.