
అధ్యక్ష పదవికి.. సంకులసమరం!
టీడీపీ జిల్లా కుర్చీ తమదేనంటున్న కమ్మ సామాజికవర్గం ప్రస్తుత అధ్యక్షుడినే కొనసాగించాలన్న సీనియర్లు కుదరని సయోధ్య.. 15 మందికి పైగా పోటీ చంద్రబాబుకు నివేదిస్తామన్న త్రిసభ్య కమిటీ
చిత్తూరు అర్బన్: ‘పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు కార్యాలయానికి రావడానికి కూడా చాలామంది మొహం చాటేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పదవుల కోసం పాకులాడుతున్నారు. ఉదయం పచ్చ కండువా.. చీకటి పడితే ప్రత్యర్థులతో లాలూచీ.. అలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకండి. ఆ కోవర్టుల వల్ల పార్టీ నాశనం అవుతుంది..’ అంటూ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తన గళాన్ని గట్టిగానే వినిపించారు. చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవితో పాటు అనుబంధ కమిటీల కూర్పు కోసం రాష్ట్ర పార్టీ నాయకత్వం అభిప్రాయ సేకరణకు దూతలను పంపింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖా మంత్రి బిసి.జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావుతో కూడిన త్రిసభ్య కమిటీ సోమవారం చిత్తూరులోని ఓ హోటల్‌లో భేటీ నిర్వహించింది. చిత్తూరు ఎంపీ ప్రసాదరావుతో పాటు ఎమ్మెల్యేలు జగన్‌మోహన్, థామస్, నాని, భానుప్రకాష్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
దందాలు చేసుకోవడానికా?
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనిపించని వ్యక్తులు, ఇప్పుడు జిల్లా అధ్యక్ష అందలం ఎక్కి వ్యాపారాలు, దందాలు చేసుకోవడానికి తప్ప.. పార్టీ బలోపేతానికి కాదని పలువురు సీనియర్లు వారి అభిప్రాయాన్ని త్రిసభ్య కమిటీ ఎదుట కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ సామాజికవర్గానికి ఇవ్వాలని, తెలుగు యువతను బీసీకు ఇవ్వాలని పలువురు పట్టుబట్టినట్లు తెలిసింది. అయితే వచ్చిన దరఖాస్తులను, ఎమ్మెల్యేలు, ఎంపీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనున్నట్లు త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. ఏదిఏమైనా టీడీపీలో నూతన కమిటీ కూర్పు తేనెతుట్టెను కదిపినట్లేనని.. లాబీయింగ్‌కు పదవులు దక్కుతాయో..? కష్టపడేవాళ్లను గుర్తిస్తారో..! చూడాలని పలువురు బాహాటంగానే చెబుతున్నారు.
తమకే కావాలి!
ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సిఆర్.రాజన్‌కు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో ఆయన్ను దానికే పరిమితం చేసేలా ఓ వర్గం ప్రణాళిక రూపొందించింది. రాజన్ స్థానంలో జిల్లా అధ్యక్ష పదవిని కమ్మ సామాజికవర్గానికే కేటాయించాలని పలువురు త్రిసభ్య కమిటీ ఎదుట అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇద్దరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు సైతం ఇదే నిర్ణయాన్ని వెల్లిబుచ్చి.. రాజన్ నాయకత్వాన్ని వ్యతిరేకించినట్లు తెలిసింది. కమ్మ సామాజికవర్గం నుంచి బంగారుపాళ్యంకు చెందిన ఎన్‌పి.జయప్రకాష్‌నాయుడు, చిత్తూరుకు చెందిన చెరుకూరి వసంత్‌కుమార్ నాయుడు, పాలసముద్రం భీమినేని చిట్టిబాబు నాయుడు, పుత్తూరుకు చెందిన పోతుగుంట విజయబాబు, చంద్రగిరికి చెందిన హేమాంబరరావు తదితరులు 15 మంది వరకు ప్రతిపాదనలను త్రిసభ్య కమిటీకి అందజేశారు. ఇక కుప్పంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కూడా తన దరఖాస్తును అందజేశారు.