● జిల్లాలో సిజేరియన్లే అధికం ● ప్రైవేటుతో పాటు ప్రభుత్వ
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవ వివరాలు
నెల సుఖ ప్రసవం సిజేరియన్ మొత్తం
సెప్టెంబర్ 575 280 855
అక్టోబర్ 599 257 856
నవంబర్ 611 261 872
డిసెంబర్ 510 283 793
జనవరి 493 222 715
ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవ వివరాలు
నెల సుఖ ప్రసవం సిజేరియన్ మొత్తంసెప్టెంబర్ 403 308 711
అక్టోబర్ 440 293 733
నవంబర్ 466 281 747
డిసెంబర్ 459 271 730
జనవరి 446 242 688
ఫిబ్రవరి 414 220 634
ఆధునిక వైద్య విధానంలోనూ అమ్మలకు కడుపు కోతలు తప్పడం లేదు. ఏటా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిజేరియన్‌లు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ స్థాయిలో సిజేరియన్ ప్రసవాల్లో మన రాష్ట్రం అయిదో స్థానంలో ఉండడం వైద్య నిపుణులను కలవరానికి గురిచేస్తోంది. సిజేరియన్‌లు తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నా అనుకున్న లక్ష్యాలు సాధించడంలో వెనుకబడుతున్నారు. ఇప్పటికై నా వైద్యాధికారులు మేల్కొనకపోతే తల్లులు మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది.
– కాణిపాకం
జిల్లాలో గర్భిణులు బలహీనమవుతున్నారు. పౌష్టికం అందక అల్లాడుతున్నారు. దీంతో గర్భిణులు కడుపు కోతలకు చేరువుతున్నారు. ఇక ఆస్పత్రులు అవసరాన్ని ఆసరాగా చేసుకుని కడుపుకోతలు పెడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా సిజేరియన్లు పుంజుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితిని ఆసరాగా చేసుకొని బలవంతంగా ప్రసవాలు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రక్తం తగ్గిందని, బిడ్డ ఉమ్మనీరు తాగేసిందని, బరువు ఎక్కువగా ఉందని, రక్తపోటు అధికమైందని, బిడ్డ అడ్డం తిరిగిందని.. ఇలా రకరకాల కారణాలు చెబుతూ ఆపరేషన్‌్ వైపు ఆసక్తి చూపుతున్నారు. లక్షల రూపాయల పేరిట ఫీజులు వసూలు చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువగా పేదలు, సామాన్యులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సిజేరియన్ ప్రసవాల్లో రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచింది. 60 శాతం ప్రసవాలు సిజేరియన్లే ఉన్నాయని వీటిని 30 శాతానికి కుదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఆపరేషన్ ప్రసవాలే అధికం
పేరుకే ప్రభుత్వాస్పత్రుల్లో సుఖ ప్రసవాలని చెప్పుకొస్తున్నారు. ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో మొత్తం 8,983 ప్రసవాలు జరగగా సాధారణ ప్రసవాలు 5,851 జరగగా ఆపరేషన్లు 3132 జరిగాయి. గతేడాది కూడా ఇదే ఇదే పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో 55 నుంచి 60 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రికార్డు స్థాయిలో ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
నిబంధనలకు పాతర
గర్భిణులకు శస్త్ర చికిత్స చేస్తే అందుకు గల కారణాలను రిపోర్ట్‌లో స్పష్టంగా నమోదు చేయాలి. కానీ అనారోగ్య కారణాలు చూపుతూ ఇష్టారాజ్యంగా శరీరంపై కత్తిగాట్లు పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా..అత్యవసరమని చెప్పి శస్త్ర చికిత్సలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. గర్భిణిని తొలి నుంచి పరిశీలించాలి. ఆశా కార్యకర్తలు నిత్యం పరిశీలించాలి. జిల్లాలో అదెక్కడా జరిగిన దాఖలాలు లేవు. శని, ఆదివారాలు వస్తే చాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కనిపించడంలేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ..
ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆస్పత్రులు కడుపు కోతలు పెడుతున్నాయి. ఆస్పత్రికి వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేసి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉన్నా పట్టించుకోవడంలేదు. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కడుపు కోతలకు ఫీజు వసూళ్లు చేస్తున్నారు. దీని కారణంగా భవిష్యత్తులో మహిళలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అయినా గర్భిణులు చేసేది లేక వైద్యుల మాటలు విని శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. మరికొందరు ముహూర్తం పేరుతో శస్త్ర చికిత్సకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొంత మంది మహిళలు పురిటి నొప్పులు భరించలేక ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ ముహూర్తాల ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జోరుగా సాగుతున్నాయి. దీంతో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లే అధికమవుతున్నాయి.
సిజేరియన్ కారణాలు..
టీనేజీ గర్భిణులు
బిడ్డ బరువు పెరగడం
బిడ్డ అడ్డం తిరగడం
ఉమ్మనీరులో తేడా
బిడ్డ తక్కువ బరువు
ఆక్సిజన్ సమస్య
హైరిస్క్ సమయాల్లో...
తల్లులు ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం
లేట్ ప్రెగెన్సీ
నొప్పులు భరించలేని సమయంలో...
నివారణ ఎలా అంటే ..
గర్భిణులు తొలి నుంచి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మందులు, మాత్రలు వాడాలి.
బీపీ, మధుమేహం కట్టడిలో ఉంచుకోవాలి.
ప్రసవ సమయానికి ఆస్పత్రిలో చేరాలి.
ముహూర్తాల పేరుతో ఆపరేషన్లు చేయించుకోకూడదు.
గతేడాది డిసెంబర్ నెలలో చిత్తూరుకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం అర్ధరాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించింది. బిడ్డ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని..సిజేరియన్ చేస్తే తల్లీ, బిడ్డ ఇద్దరు సురక్షితమని అక్కడి డాక్టర్లు గర్భిణి కుటుంబీకులకు వివరించారు. వారు చెప్పే మాటలకు భయపడ్డ కుటుంబీకులు వెంటనే తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు సుఖ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఇద్దరు సురక్షితంగానే ఉన్నారు.
గుడిపాలకు చెందిన ఓ గర్భిణి ఆరు నెలల కిందట ప్రసవం కోసం చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. అక్కడ అన్ని పరీక్షలు చేసి అత్యవసరమంటూ వెంటనే ఆపరేషన్‌కు సిద్ధపడిపోయారు. ఆపరేషన్‌కు రూ.80 వేలు అవుతుందని చెప్పారు. ఆపై వారు బంధువుల సలహా తీసుకున్నారు. తమిళనాడులోని ఓ ఆస్పత్రి వైద్యులు మాత్రం తొలి చెకప్ నుంచి సుఖ ప్రసవమంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆలోచనలో పడ్డ ఆమె భర్త వెంటనే అంబులెన్స్ ద్వారా వేలూరుకు తీసుకెళ్లారు. అక్కడ సుఖ ప్రసవం చేశారు. రూ.35 వేలతో బయటపడ్డారు.
హైరిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ
రకరకాల కారణాల వల్ల సిజేరియన్లు జరుగుతుంటాయి. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను అప్రమత్తం చేస్తూ వస్తున్నాం. గర్భిణుల నమోదు విషయంలో తక్షణ స్పందించేలా చేస్తున్నాం. చాలా మంది మూడో నెలో, ఐదో నెలలో నమోదు చేసుకుంటున్నారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించి వైద్య సూచనలు, సలహాలు ఇస్తున్నాం. హైరిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. టీనేజీ గర్భిణులపై దృష్టి సారిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. – సుధారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు
పౌష్టికాహారం తీసుకోవాలి
జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తినే తిండిలో బలం ఉండాలి. జంక్ ఫుడ్స్ వద్దు. మంచి పౌష్టికం ఉన్న పదార్థాలను తీసుకోవాలి. మూఢ నమ్మకాలు వీడాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్య సూచనల మేరకు మందులు, మాత్రలు వాడాలి. పురిటి నొప్పులు భరించలేక ఆపరేషన్ల జోలికి వద్దు. బిడ్డకు జన్మనివ్వడం దేవుడు ఇచ్చిన వరం. – ఉషశ్రీ, గైనిక్ వైద్యురాలు, చిత్తూరు
● జిల్లాలో సిజేరియన్లే అధికం ● ప్రైవేటుతో పాటు ప్రభుత్వ
● జిల్లాలో సిజేరియన్లే అధికం ● ప్రైవేటుతో పాటు ప్రభుత్వ
● జిల్లాలో సిజేరియన్లే అధికం ● ప్రైవేటుతో పాటు ప్రభుత్వ
● జిల్లాలో సిజేరియన్లే అధికం ● ప్రైవేటుతో పాటు ప్రభుత్వ


