న్యూ ఇయర్ కిక్కు రూ.14 కోట్లు
చిత్తూరు అర్బన్ : ప్రభుత్వం మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా చూడటం బహుశా ఏపీలోనే కావొచ్చేమో..! కేవలం మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజల సంక్షేమ పథకాలను కొనసాగించేయొచ్చనే ధైర్యం పాలకుల్లో ఉంటోంది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.కోట్లు దాటేసింది. మామూలు రోజుల్లో జిల్లాలో సగటున రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోంది. కానీ జనవరి 1వ తేదీ వస్తోందంటే మద్యం వ్యాపారులకు.. ప్రభుత్వానికి పండగే. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో మద్యం విక్రయాల సమయం పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం.. మందుబాబులు తాగుతూ, తూగడానికి రూ.కోట్లు ఖర్చు పెట్టేశారు. డిసెంబరు 30వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో 7,500 బాక్సుల మద్యం, 2,500 బాక్సుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.5.05 కోట్లు. ఇక డిసెంబరు 31వ తేదీన 4,900 మద్యం బాక్సులు, 2400 బీరు బాక్సులు అమ్మడం ద్వారా రూ.3.78 కోట్ల ఆదాయం లభించింది. రెండు రోజుల్లోనే రూ.8.83 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇక మద్యం బార్లలో రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరగడంతో మొత్తంగా రెండు రోజులకు రూ.10.83 కోట్లు మద్యం కాసులు కురిశాయి. ఇక జనవరి 1వ తేదీన అమ్మకాలు రూ.3 కోట్ల దాటొచ్చని నిర్వాహకులు ధీమాగా ఉన్నారు. ఈ లెక్కన న్యూ ఇయర్ కిక్కు దాదాపు రూ.14 కోట్లన్నమాట.


