నేడే చివరి రోజు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సబ్సిడీ అదనపులోడ్ క్రమబద్ధీకరణకు బుధవారం చివరి రోజు అని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 6వేల మంది వినియోగదారులు 9వేల కిలోవాట్ల లోడ్‌ను క్రమబద్ధీకరించుకున్నరన్నారు. తద్వారా సంస్థకు రూ.1.1 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. స్వచ్ఛందంగా గృహ వినియోగదారులు లోడ్‌ను క్రమబద్ధీకరించుకుంటే సబ్సిడీ 50 శాతం వర్తిస్తుందన్నారు.
గిరిజనుల ఆరోగ్య భద్రతే లక్ష్యం
పూతలపట్టు(యాదమరి): గిరిజనుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని గువ్వల కాలనీలో గిరిజన వికాసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను దగ్గర చెయ్యడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం ఆయన పలు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కాగా ఈ వైద్య శిబిరంలో కాలనీ ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, తహసీల్దార్ రమేష్‌బాబు పాల్గొన్నారు.
సామాన్యులకు
ఇబ్బంది కలిగించొద్దు
చిత్తూరు అర్బన్: కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను పెట్టుకుని ముందుకు వెళ్లండి.. అని ఎస్పీ తుషార్‌డూడీ సూచించారు. శాంతిభద్రతల పర్యవేక్షణ, ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి పోలీసుశాఖ పనిచేస్తుందన్నారు. మహిళలపై నేరాల నియంత్రణకే ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా తనను కలిసి చెప్పొచ్చని సూచించారు. న్యూ ఇయర్ పేరిట బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి వాహనాలు నడపడం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల పాటు పోలీసులు అన్నిచోట్ల తనిఖీలు నిర్వహిస్తారన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించకుండా న్యూ ఇయర్ చేసుకోవాలని చెప్పారు.
పకడ్బందీగా యూరియా పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో రబీ సీజన్‌కు గాను పంటలకు అవసరమైన 20,183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 5,747 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటికే 6,753 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు యూరియా కొరత రాలేదన్నారు. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే లైసెన్స్‌లను రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
మరో బాధితుడు
చిత్తూరు కార్పొరేషన్: తుక్కు మాఫియా బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీఎస్టీ నోటీసులు వస్తుండడంతో అమయాకులు బయటపడుతున్నారు. నగరంలో తోపుడు బండిపై వీధి వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తికి రూ.12.3 కోట్లు ఫెనాల్టీ నోటీసులు జారీ అయిందన్న సమాచారం మంగళవారం సంచలనం రేకెత్తించింది. ఆ వ్యక్తి కోసం సీజీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు గాలిస్తున్నారని, అయితే నోటీసులు అందుకున్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సంబంధం లేని వ్యక్తులకు రూ.లక్షలు, కోట్లు చెల్లించాలని నోటీసులు రావడంతో వారు షాక్‌అవుతున్నారు. ఇప్పటికే రూ.400 కోట్లు అక్రమంగా రిటర్న్‌లో తీసుకునున్నట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించుకున్నారు.
లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ట్రెజరీశాఖ డీడీ రామచంద్ర సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్‌దారులు వార్షిక జీవ న ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. 01–01–2026 నుంచి 28–02–2026 లోపు పెన్షనర్‌లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్‌లను అందజేయాలన్నారు. గడువు తేదీలోపు సమర్పించకపోతే ఏప్రిల్ 1న ఇచ్చే మార్చినెల పెన్షన్ నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని సబ్ ట్రెజరీ ఆఫీసుల్లోనూ సర్టిఫికెట్ అందజేయొచ్చన్నారు.


