మట్టి..కొల్లగొట్టి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి నేతలు మైనింగ్ మత్తులో జోగుతున్నారు. ఇసుక, మట్టిని ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు. చిత్తూరు మండలం, బండపల్లి రెవెన్యూలోని 194 వెంకటాపురంలో కూటమికి సంబంధించిన వ్యక్తులు మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా కొండను తవ్వేస్తున్నారు. జేసీబీలతో కరిగించేస్తున్నారు. ట్రాక్టర్లతో పట్టణానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ మట్టి రూ.1000కి విక్రయిస్తున్నారు. ఇలా వందల ట్రాక్టర్లు తిప్పేస్తున్నారు. జేసీబీకి లోడ్‌కు రూ.150 చెల్లించి మిగిలిన ఆదాయాన్ని కూటమి నేతలు జేబులో వేసుకుంటున్నారు. మామిడి తోట అడ్డుగా ఉండడంతో ఈ దోపిడీ ఎవరి కంటా పడడం లేదు. 20 రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా మట్టి దోపిడీ సాగుతోంది. అడవిలో జింకల సంచారం ఉందని, మట్టి తవ్వకాలతో మూగజీవులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి.. మట్టి దోపిడీని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. సేదతీరుతున్న మూగజీవాలకు ఆటంకం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.


