కేంద్ర నిధులపై ఆంక్షలేంటి?
జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ధ్వజం
చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ఆర్థిక సంఘ నిధుల పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల పై నిబంధనలు పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఏడాదిన్నరగా అక్రమాలు జరుగుతుంటే ఎందుకు విచారణ చెయ్యలేదని ప్రశ్నించారు. స్పరంచుల పదవీ కాలం ముగయనుండడంతో ఇలాంటి చర్యలకు కుట్రపన్నారని ధ్వజమెత్తారు. గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వరాదని, ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు మంజూరు చేయరాదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం జీతాలు లేకుండా పనిచేయడం లేదు కదా అని ప్రశ్నించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. ఎర్రవారిపాళెంలో రూ.20 లక్షలతో ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం భవనం నిర్మించడానికి అనుమతులిచ్చినా ఎందుకు పనులు చేయలేదని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు సమావేశానికి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వితంతు పింఛన్లు 319, వికలాంగ పింఛన్లు 222 కొత్తగా మంజూరైనట్టు వెల్లడించారు. సీఈఓ రవికుమార్‌నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ భారతి పాల్గొన్నారు.
మొక్కుబడిగా..
స్టాండింగ్ కమిటీ సమావేశమంటే పలు శాఖల అధికారులకు లెక్క లేకుండా పోయింది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి హెచ్‌ఓడీలు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. చిత్తూరు జిల్లా నుంచి పలువురు అధికారులు హాజరుకాలేదు. దీంతో సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.43 గంటలకు ముగించేశారు. కమిటీల పరంగా జెడ్పీటీసీ సభ్యులు మారాల్సి ఉండగా మారలేదు. హాజరుపట్టికలో మాత్రం సంతకాలు పెట్టేశారు. 4వ కమిటీ సమావేశానికి 1,7 కమిటీలో ఉన్న సభ్యులే ఉన్నారు.
సమస్యలపై నిలదీత
పలు అంశాల పై జెడ్పీటీసీ సభ్యులు అధికారులను నిలదీశారు. కుప్పంలో కొలమాసపల్లె–నెలిపట్ల రోడ్డు టెండర్ అయినా ఇంతవరకు ఎందుకు పనులు ప్రారంభిచలేదని ప్రశ్నించారు. అలాగే పుంగనూరు, సదుం, పీలేరు, భాకరాపేట దారులు గుంతలుపడినా పట్టించుకోలేదన్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో హంద్రీ–నీవా ప్రాజెక్టు నుంచి ఉపకాలువలు నిర్మించి తద్వారా చెరువులను నింపాలన్నారు. గతంలో ఇంటి స్థలం మంజూరైన వారికి ప్రస్తుతం రుణ సాయం చేస్తారనే అంశాన్ని లేవదీశారు. అలాగే పునాది పనులు పూర్తయిన గృహాలకు సాయం అందిస్తారా..? అని ప్రశ్నించారు. విద్యుత్ అధికారులు తాగునీటి సర్వీసులకు కూడా కరెంటు పోల్స్ ఇవ్వకపోవడమేంటని మండిపడ్డారు. ఆర్‌డీఎస్‌ఎస్ పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. పలు ప్రాంతాల్లో కేబుల్స్ పాడైనా మార్చడం లేదన్నారు. పాలసముద్రం మండలంలో అంగన్‌వాడీ భవనం పూర్తయినా ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. కార్యక్రమంలో పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు.


