పేదల బతుకులు చితికిపోతున్నాయి బాబూ!
–మాజీ ఉప ముఖ్యమంత్రి ధ్వజం
కార్వేటినగరం: బాబు ప్రభుత్వంలో పేదల బతుకులు చితికిపోతున్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేవారు. మంగళవారం పుత్తూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయకపోగా కేవలం ధనంవతులు, ఉన్నవారికే పెద్దపీట వేయడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానం బడుగు, బలహీన వర్గాల పాలిట శాపంగా మారిందన్నారు. 2025లో చంద్రబాబు ప్రభుత్వం అనేక మార్పులకు శ్రీకారం చుట్టి తద్వారా అన్ని వర్గాల వారికి తీరని అన్యాయం, ద్రోహం చేసినట్లు చెప్పారు. వ్యవస్థలను ఎమ్మెల్యేల గుప్పెట్లోకి తీసుకుని పేదలను ముంచేస్తున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీల స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడిచేలా సీఎం చంద్రబాబు డైరెక్షన్ ఇవ్వడం విడ్డూరమన్నారు. సామాన్య ప్రజలు ఎక్కడికెళ్లినా న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన బాధితులను ఏ పార్టీకి చెందిన వారని అధికారులు అడగడం శోచనీయమన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేసి పేదల కడుపుకొట్టేందుకు పూనుకున్నట్లు విమర్శించారు. అన్నదాతల గురించి పట్టించకోకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇసుక, గ్రావెల్‌ను విచ్చిలవిడిగా సరిహద్దులు దాటిస్తూ దోచుకుంటున్నా అధికారులు ఏం చేయలేకున్నారని ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ నాయకు లు చెప్పినట్లు అడుతున్నాయని ఆక్షేపించారు.


