చైన్నె టూ మైసూర్‌ వయా చిత్తూరు మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్నె టూ మైసూర్‌ వయా చిత్తూరు మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌

Jan 14 2024 1:30 AM | Updated on Jan 14 2024 11:09 AM

- - Sakshi

గుడిపాల: తమిళనాడులోని చైన్నె నుంచి కర్ణాటకలో ఉన్న మైసూరుకు బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సుమారు 435 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్‌ వేయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ (నేషనల్‌ హైస్పీడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) అధికారులు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్‌ ట్రైన్‌ పూర్తిగా ఫైఓవర్‌పై వేసిన ట్రాక్‌లోనే వెళ్లనుంది. ఈ క్రమంలో జిల్లాలోని 41 గ్రామాల్లో భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు.

మూడు రాష్ట్రాలను కలుపుతూ..
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకను కలుపుతూ 340 గ్రామా ల మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ రాకపోకలు సాగించేలా అధికారులు డీపీఆర్‌ రూపొందించారు. సాధారణంగా చైన్నె నుంచి మైసూర్‌కు రైలులో వెళ్లాలంటే దాదాపు 10 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్‌ ట్రైన్‌లో అయితే కేవలం 2 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ ట్రైన్‌కు చిత్తూరులో స్టాపింగ్‌ ఇవ్వడంతో జిల్లావాసులకు సైతం సేవలందించనుంది.

జిల్లాలో 41 గ్రామాలు
జిల్లాలోని 41 గ్రామాల మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ ప్రయాణించనుంది. ఈ మేరకు 435 కిలోమీటర్ల వరకు 18 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్‌ నిర్మించేందుకు డిజైన్‌ రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఇప్పటికే శాటిలైట్‌, ల్యాండ్‌ సర్వే పూర్తి చేసింది. 750 మంది ప్రయాణికులతో గంటకు 250 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ ట్రైన్‌ వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. గుడిపాల మండలంలోని 189 కొత్తపల్లె వద్ద చిత్తూరు స్టాపింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు.

రైతులతో సమావేశాలు
ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ అధికారులు భూసేకరణలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.. 41 గ్రామాలకు గాను 30 గ్రామాలకు చెందిన రైతులతో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేశారు. వారి అభిప్రాయాలను పకడ్బందీగా సేకరిస్తున్నారు. భూములు ఇచ్చిన వారి కుటుంబంలో చదువుకున్న వారికి ఏదో ఒకవిధంగా ఉద్యోగావకాశం కల్పిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. దీనిపై పలువురు రైతులు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఐదురెట్ల పరిహారం
బుల్లెట్‌ ట్రైన్‌లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం రెండు గంటల్లోనే చైన్నె నుంచి మైసూర్‌కు వెళ్లిపోవచ్చు. మొత్తం ఫ్లైఓవర్‌ మీద వేసిన ట్రాక్‌పైనే రైలు వెళుతుంది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాం. రైతులకు మార్కెట్‌ ధర కంటే ఐదు రెట్లు పరిహారం ఇవ్వాలని నిర్ణయించాం.
– నరసింహ, ఏఈ, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌

సర్వేలో భాగంగా నాటిన రాయి1
1/1

సర్వేలో భాగంగా నాటిన రాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement