పోరాటాలతోనే హక్కుల సాధన
– దళిత ఉద్యమ నేత బైరి నరేష్
శ్రీరంగరాజపురం : అణగారిన వర్గాల వారు ఐకమత్యంతో హక్కుల కోసం ఉద్యమిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పీఠాలు కదలాలని ముఢ నమ్మకాల నిర్మూలన సంస్థ, దళిత ఉద్యమ నేత బైరి నరేష్ పిలుపునిచ్చారు. మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట దీపిక కల్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత మహాసభ ఆధ్వర్యంలో దళిత నాయకుడు మునికృష్ణ అధ్యక్షతన నియోజవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అంతకుముందు 49 కొత్తపల్లిమిట్ట ప్రధాన కూడలిలో ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బైరి నరేష్ మాట్లాడుతూ దళితులు, అణగారిన వర్గాలు మూఢనమ్మకాలతో తమ హక్కులను తామే కాలరాసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారినా దళుతులపై దాడులు ఆగడం లేదన్నారు. గతంలో చుండూరు, కారంచేడు, నేలవంకలో అగ్రవర్ణాల వారి చేతులో దళితులు ఊచకోతకు గురయ్యార ని పేర్కొన్నారు. టీడీపీకి ఓటు వేయలేదని చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పాదిరికుప్పం దళితవాడలోని ఇళ్లను కాల్చేశారని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో పిఠాపురం, పల్నాడులో సాల్మన్ హత్యతోపాటు దళిత యువతులు, మహిళులపై దాడులు పెరిగిపోయాయన్నారు. దళితులకు రక్షణ కరువైందని, రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమన్నారు. విద్యతోనే సమాజంలో ఆర్థిక సమానత్యం సాధించవచ్చని తెలిపారు. ఐకమత్యంతో హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ డిప్యూటీ కలెక్టర్ ప్రకాష్‌రావు, హైకోర్టు అడ్వకేట్ నవయాన్, తమిళనాడు పెరియార్ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, కేర్ సంస్థ అధ్యక్షు లు పాల డేవిడ్, రామాంజనేయులు, ప్రభాకర్, శివరాం తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దళిత నాయకులు, మాట్లాడుతున్న బైరి నరేష్
పోరాటాలతోనే హక్కుల సాధన


