
జీఎస్‌టీలో శ్లాబుల క్రమబద్దీకరణ ద్వారా నిత్యావసరాల నుంచి ఖరీదైన ఎల్రక్టానిక్ ఉత్పత్తుల వరకు రేట్లను తగ్గించగా.. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఈ–కామర్స్ సంస్థలు అందించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేస్తున్నాయా? అన్నది తెలుసుకునేందుకు కేంద్ర సర్కారు ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై నిఘా పెట్టింది.
వస్తు, సేవల పన్నులో (జీఎస్‌టీ) 12 శాతం, 28 శాతం శ్లాబులను ఎత్తివేసి, వీటిల్లోని వస్తువులను 5, 18 శాతం శ్లాబుల్లోకి మార్చడం తెలిసిందే. దీనివల్ల 375కు పైగా వస్తువుల రేట్లు తగ్గాల్సి ఉంది. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చేలా జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాత రేట్లతో మార్కెట్లో ఉన్న వస్తువులను సైతం తగ్గించిన రేట్లపైనే విక్రయించాల్సి ఉంటుందని కేంద్ర సర్కారు ఆదేశించింది. అయినప్పటికీ ధరల తగ్గింపు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా తెలుస్తోంది.
కొన్ని ఈ–కామర్స్ వేదికలపై విక్రయించే రోజువారీ వస్తువుల రేట్లును తగ్గించలేదంటూ ఫిర్యాదులు వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో జీఎస్‌టీ రేట్ల కోతను ఈ–కామర్స్ సంస్థలు సాఫీగా, సజావుగా బదిలీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం పర్యవేక్షణ మొదలు పెట్టింది. పన్ను రేట్లను తగ్గించారా? లేదా అన్నది రెవెన్యూ శాఖ పరిశీలిస్తోందని చెప్పాయి. జీఎస్‌టీ రేట్లు అమల్లోకి వచ్చినా, రేట్లలో మార్పులు చేయకపోవడాన్ని సాంకేతిక సమస్యలుగా ఈ–కామర్స్ సంస్థలు పేర్కొంటున్నట్టు సమాచారం.
నెలవారీ నివేదిక..
సాధారణంగా వినియోగించే 54 వస్తువుల రేట్లలో మార్పులపై నెలవారీ నివేదిక ఇవ్వాలంటూ సెంట్రల్ జీఎస్‌టీ అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించడం గమనార్హం. వీటిల్లో వెన్న, షాంపూ, టూత్‌పేస్ట్, టమాటా కెచప్, జామ్, ఐస్‌క్రీమ్, ఏసీ, టీవీలు, డయగ్నోస్టిక్స్ కిట్లు, గ్లూకోమీటర్లు, బ్యాండేజ్‌లు, థర్మోమీటర్‌లు, ఎరేజర్లు, క్రేయాన్లు, సిమెంట్ ఉన్నాయి.
ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే