అబ్బా.. ఇంటికి ఏముంది ఎలివేషన్‌! | Vertical Garden in house elevation real estate | Sakshi
Sakshi News home page

అబ్బా.. ఇంటికి ఏముంది ఎలివేషన్‌!

Jul 20 2025 12:07 PM | Updated on Jul 20 2025 1:08 PM

Vertical Garden in house elevation real estate

గతంలో ఇల్లు అంటే నాలుగు గోడలుండే నిర్మాణం. కానీ, ఇప్పుడు ఇల్లంటే ఓ హోదా.. హుందా! ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు సొంతింటివాసులు. నిర్మాణ సంస్థలూ తక్కువేం కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో కనిపించే విభిన్న తరహా నిర్మాణాలను భాగ్యనగరంలో నిర్మించేస్తున్నారు. ప్రాజెక్ట్‌ ఎలివేషన్స్‌ నుంచే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టేస్తున్నారు. పడవ ఆకారంలో ఎలివేషన్, ఎలివేషన్‌లోనే వర్టికల్‌ గార్డెన్‌ ఏర్పాటు వంటివి ఈ జాబితాలోనివే మరి!! సాక్షి, సిటీబ్యూరో

పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణాలుండాలి. మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్‌లను ప్రజలు ఆదరించట్లేదు. విదేశీ తరహాలో నిర్మాణం.. అన్ని రకాల వసతులు.. అదీ అందుబాటు ధరల్లో ఉండే ప్రాజెక్టులు అంటే కస్టమర్లు జై కొడుతున్నారు. దీంతో విదేశాల్లో కనిపించే విభిన్న నిర్మాణాలు ఇప్పుడు భాగ్యనగరంలోనూ కనిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించడం కోసం విభిన్న ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో సంస్థల మధ్య పోటీ పెరిగి భాగ్యనగరం హంగులు అద్దుకుంటోంది.

ఎలివేషన్లలో వర్టికల్‌ గార్డెన్‌..

రిసార్ట్, విల్లాల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. అందుకే చుట్టూ పచ్చదనంతో ల్యాండ్‌ స్కేపింగ్‌ చేస్తారు. కానీ, అపార్ట్‌మెంట్స్‌లో.. అది కూడా స్థలాల లభ్యత తక్కువగా ఉండే మహానగరాల్లో కాసింత కష్టమే. దీనికి పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది నిలువైన ఉద్యానవనాలు(వర్టికల్‌ గార్డెన్స్‌).

భవనాల ఎలివేషన్లలో నిలువుగా మొక్కలు పెంచడం వర్టికల్‌ గార్డెన్స్‌ ప్రత్యేకత. అయితే ఇవి ఎలివేషన్, బయటి గోడల మీదనే సాధ్యమవుతాయి. ఎండ పడని ప్రాంతంలో అంటే ఇంట్లో, హాల్‌లో, బెడ్‌ రూమ్‌లో వర్టికల్‌ గార్డెన్స్‌ను పెంచడం కుదరదు. ఇక్కడ పూల మొక్కలు, ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచుకోవచ్చు. సూర్యరశ్మి పడే ప్రాంతమైతే వర్టికల్‌ గార్డెన్స్‌లో కూరగాయలు, ఆకుకూరలు కూడా పెంచుకునే వీలు కూడా ఉంటుంది.

ఖర్చు ఎక్కువే..

సాధారణ భవనాలతో పోలిస్తే వరి్టకల్‌ గార్డెన్స్‌ భవనాల ధర చ.అ.కు రూ.100200 అధికంగా ఖర్చవుతుంది. అయినా సరే బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. కస్టమర్లకు ఏదో నాలుగు గోడలుండే ఇంటిని అందించాలని కాకుండా వారి ఇంటిని అందంగా.. ఆరోగ్యకరంగా బృందావనంగా తీర్చిదిద్దుతున్నారు. వర్టికల్‌ గార్డెన్స్‌ భవనాలు పర్యావరణహితంగా ఉంటాయి. శబ్ధ, వాయు కాలుష్యం తక్కువగా ఉండటంతో పాటు ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. భవనం గోడలు, పిల్లర్లను ఆధారం చేసుకొని బయోలాజికల్‌ ఎరువులతో పెంచడం వల్ల భవనం చల్లగా ఉంటుంది.

పిల్లలే లక్ష్యంగా..

ఇంటి కొనుగోళ్లలో పిల్లల అభిరుచులకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే పిల్లల అభిరుచులకు అనుగుణంగా విదేశీ ఆర్కిటెక్చర్లతో ప్రాజెక్ట్‌లను డిజైన్‌ చేయిస్తున్నారు బిల్డర్లు. ఇందుకోసం ప్రాజెక్ట్‌ ఎలివేషన్‌ దగ్గర నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతోనే పిల్లల్ని ఆకట్టుకుంటే.. ప్రాజెక్ట్‌లోనే పాఠశాలలు, ఆస్పత్రుల వంటి ఏర్పాటుతో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు.

అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రాజెక్ట్‌లో క్లబ్‌ హౌస్, స్విమ్మిగ్‌ పూల్, జిమ్‌ వంటి ఆధునిక సదుపాయాలే కాకుండా ఇందులోనే పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్ట్‌లో క్లబ్‌హౌజ్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి వసతులు కల్పించాలంటే కొంత స్థలాన్ని కేటాయిస్తారు. అలా కాకుండా ఎలివేషన్‌కు కేటాయించే స్థలంలో ఈ వసతులను కల్పిస్తే.. స్థలం వినియోగంతో పాటు ఫ్లాట్ల విస్తీర్ణమూ పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement