
వాన పడితే చాయ్, పకోడీతో ‘వావ్’ అనాలా? లేదా తడి బట్టల టెన్షన్‌తో ‘ఓహ్ నో!’ అనాలా?. ఇప్పుడు వావ్ మాత్రమే అనిపించేలా, వాన తెచ్చే టెన్షన్‌కి బై.. బై చెప్పే గాడ్జెట్స్ వచ్చేశాయి. అవే ఇవి.
ఇంట్లోనే ఆరేసేయ్!
ఇంట్లో బట్టలు ఆరేయడానికి చోటు లేదు, బయట గాలి లేదు, లాండ్రీకి వేసేందుకు టైమ్ లేదు.. ఇలా వానాకాలంలో బట్టలు అన్నవే బాధగా మారిపోయాయా? కూల్! ఇప్పుడు మార్కెట్లోకి చిటికెలోనే దుస్తులను ఆరబెట్టే అద్భుతమైన పరికరం వచ్చేసింది. పేరు ‘ఎక్స్‌ప్రెస్ డ్రైయర్ ఔరేట్ ప్రో మ్యాక్స్’. చిన్న బాటిల్ సైజులో ఉండే ఈ పరికరం, ఒకేసారి నాలుగు పెద్ద దుస్తులను ఆరబెట్టగలదు. అంతేకాదు, దీనిని ఆన్ చేసుకుంటే, ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి దుస్తులపై ఉండే సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. దీని వల్ల దుస్తుల మురుగు వాసన తొలగి, అచ్చం బయట ఎండలో ఆరవేసినంత శుభ్రంగా తయారవుతాయి. పవర్ ఆన్‌చేసి, ఒక్కసారి టైమర్ పెడితే, పని అయిపోగానే ఆదే ఆగిపోతుంది. ఈ డ్రైయర్‌ను మడతపెట్టి సూట్‌కేస్‌లో పెట్టుకోవచ్చు కూడా. దీని ధర రూ. 4,712.

కవర్ వేసి కూల్‌గా నడవండి
వర్షం రాగానే చాలామంది హెల్మెట్, గొడుగు, రెయిన్ కోట్ వేసుకొని ఫుల్ ప్రొటెక్షన్ మోడ్‌లోకి వెళ్తారు. ముఖం తడవదు, జుట్టు తడవదు కాని, చెప్పులు? కొత్తగా కొన్న బ్రాండెడ్ షూస్ బురదలో మునిగి, మురికి నీళ్లలో నానిపోయి, ఇంట్లోకి అడుగు పెట్టే సరికి వాసనతో బరువెక్కిపోతుంటాయి. ఇప్పుడు ఆ బాధకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు మార్కెట్‌లోకి వచ్చాయి వాటర్‌ప్రూఫ్ షూ కవర్స్. పీవీసీ మెటీరియల్‌తో తయారైన ఇవి జిప్పర్, డ్రాస్ట్రింగ్ డిజైన్‌లతో షూస్‌కి నాలుగు వైపులా కవచంలా ఉంటాయి. వర్షం, మంచు, మట్టి, బురద నుంచి రక్షణ ఇస్తాయి. నాన్‌స్లిప్ సోల్ వల్ల వీటితో నడిచేటప్పుడు జారిపోయే ప్రమాదం ఉండదు. వీటిని మడతపెట్టి పాకెట్‌లో వేసుకోవచ్చు. ధర వివిధ కంపెనీలను బట్టి రూ. 200 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది.

సురక్షితమైన వెలుగు సువాసనతో
వర్షం వచ్చినప్పుడల్లా పవర్ కట్ కామన్! టీవీ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది, ఇల్లంతా చీకటి కమ్మేస్తుంది. అప్పుడు మనం క్యాండిల్స్ వెలిగిస్తాం. అది మామూలు క్యాండిల్ అయితే, చేతుల మీద కరిగిన మైనం పడి మండుతుంది. గాజు జార్‌లో ఉన్న క్యాండిల్ చీకట్లో పగిలిపోతుంది. అందుకే, ఇలాంటి సమయాల్లో నిజంగా పనికొచ్చేవి మామూలు క్యాండిల్స్ కాదు, ‘సాండ్ వాక్స్ క్యాండిల్స్’. ఈ క్యాండిల్ వాక్స్ మామూలు వాక్స్ కాదు. సువాసనతో కూడిన పౌడర్ వాక్స్. ఇది రీఫిల్లబుల్, నాన్ టాక్సిక్. చేతులపై కరిగి పడదు, పొగతో చికాకు పెట్టదు. మీకు ఇష్టమైన గిన్నెలో వేసుకుని, అందులో ఒత్తి పెట్టి వెలిగించుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా ఒత్తి తీసి మళ్లీ వాడుకోవచ్చు. ధర. రూ.309 మాత్రమే!