
టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.
అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.
ఏఐ చాట్‌బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్‌బాట్‌ల అవుట్‌పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు
ఏఐ చాట్‌బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.