
ఏఐ రాకతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది. హ్యుమానాయిడ్ రోబోలు ప్రతి పనిలోనూ ఊహించినదానికంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. మానవుల కంటే వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మనుషులు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే జపాన్, చైనా వంటి దేశాల్లో రోబోలను నిర్మాణ పనులలో ఉపయోగిస్తున్నారు. ఇవి మనుషుల కంటే వేగంగా గోడ కేట్టేస్తున్నాయి, ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తున్నాయి. నిర్మాణ పరిశ్రమలో రోబోలు గణనీయమైన మార్పులు తెస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
చైనాలో కొన్ని రోబోలను రాత్రి సమయంలో గ్యాస్ స్టేషన్‌లలో సేవలకు నియమించారు. ఇవి కస్టమర్లకు కావాల్సిన సేవలను అందిస్తున్నాయి. రాత్రి సమయంలో మనుషులు పని చేయడం కొంత కష్టమే. కానీ రోబోలు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా.. పనిచేస్తూ ముందుకు సాగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలోనూ.. సూచిక బోర్డులను వేయడంలోనూ రోబోలు పనిచేస్తున్నాయి.
ఇప్పటికే విమానాశ్రయాలు, హోటల్స్ లేదా రెస్టారెంట్లలో.. రోబోలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనుషుల స్థానంలో ఇవి పనిచేస్తూ.. నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. ఫ్యాక్టరీలో సర్వీసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ వంటి పనుల్లో కూడా రోబోల వినియోగం ఎక్కువగానే ఉంది.
ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఎలక్ట్రిక్ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా రోబోలు పాత్ర ప్రశంసనీయం. హై వోల్టేజ్ పవర్ మరమ్మత్తుల సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రంగంలో రోబోలను ఉపయోగించడం వల్ల.. ప్రాణహాని ఉండదు. అంతే కాకుండా పని కూడా వేగవంతం అవుతుంది. మొత్తం మీద ప్రతి రంగంలోనూ మాయ చేస్తున్నట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.