
ఎలక్ట్రికల్ ఉత్పత్తుల సంస్థ సిల్వర్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. వీటి ప్రకారం రూ. 1,000 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో ప్రమోటర్లు విక్రయించనున్నారు.
2023–2025 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ ఆదాయం వార్షికంగా 95 శాతం వృద్ధి చెందింది. పంపులు, మోటర్ల ఉత్పత్తికి సంబంధించి 24,00,000 యూనిట్లు, 72,00,000 ఫ్యాన్ల స్థాపిత సామర్థ్యంతో సంస్థకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్లాంటు ఉంది.
ఐపీఓకు టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్
వేస్ట్‌వాటర్ ట్రీట్‌మెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సన్నద్ధమవుతోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా 95.05 లక్షల తాజా ఈక్విటీలు జారీ చేయనుంది. ప్రమోటర్ కంపెనీ కార్తికేయ్ కన్‌స్ట్రక్షన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద 23.76 లక్షల షేర్లను విక్రయించనుంది.
సమీకరించే రూ.138 కోట్ల నిధులను మూలధన వ్యయ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకుంటామని కంపెనీ ముసాయిదా పత్రాల్లో తెలిపింది. ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఖంబట్టా సెక్యూరిటీస్, రిజిస్ట్రార్‌గా బిగ్‌షేర్ సర్వీసెస్‌లు సంస్థలు వ్యవహరించనున్నాయి. టెక్నోక్రాఫ్ట్ 2025 జూన్ 30 నాటికి రూ.685.83 కోట్ల విలువైన ఆర్డర్లు కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2025లో రూ.28.20 కోట్ల నికర లాభం, రూ.279.56 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.