టయోటా తన పాపులర్ ఎస్‌యూవీ అయిన ఫార్చ్యూనర్ (టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్)ను ఆధునిక హంగులతో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 36.51 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 4x2 మాన్యువల్, 4x2 ఆటోమేటిక్ వేరియంట్‌ల రూపంలో లభిస్తుంది. బుకింగ్‌లు అక్టోబర్ 12 నుంచి ప్రారంభమవుతాయి.
2026 టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. ఇందులో అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, దానికి సరిపోయే హబ్ క్యాప్‌లతో కూడిన గ్లాస్-బ్లాక్ అల్లాయ్ వీల్స్, నలుపు రంగు వెనుక డోర్ గార్నిష్, నలుపు రంగులో ఫినిష్ చేసిన యాంటెన్నా ఉన్నాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపల సీట్లు, డోర్ ట్రిమ్‌లపై నలుపు, మెరూన్ రంగు అపోల్స్ట్రేతో పాటు, యాంబియంట్ లైటింగ్, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్‌లు ఉన్నాయి. ఈ మార్పులు మొత్తం లేఅవుట్‌ను మార్చకుండా క్యాబిన్ రూపాన్ని కొత్తగా చేస్తాయి. టయోటా ఫార్చ్యూనర్ సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, యాటిట్యూడ్ బ్లాక్ అనే మూడు రంగులలో లభిస్తుంది.
2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ ధర 4x2 మాన్యువల్ వేరియంట్‌కు రూ. 36.51 లక్షలు, 4x2 ఆటోమేటిక్ వేరియంట్‌కు రూ. 38.72 లక్షలుగా (రెండు ఎక్స్-షోరూమ్ ధరలు) నిర్ణయించారు. మాన్యువల్ వేరియంట్ కంటే ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 2.21 లక్షలు అధికంగా ఉంది. టయోటా ఇంజిన్, గేర్‌బాక్స్ లేదా పనితీరుకు సంబంధించిన ఎలాంటి మార్పులను ప్రకటించలేదు.
ఇదీ చదవండి: భారత్ స్టార్‌లింక్ పంచాయితీలో బిగ్ ట్విస్ట్!


