
ప్రముఖ అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా యూఎస్‌లో కొత్త సైబర్‌ట్రక్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) నిర్ణయించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు సైబర్‌ట్రక్ మోడళ్లలో చౌకైనదిగా కంపెనీ పేర్కొంది. కొత్త సైబర్‌ట్రక్ వేరియంట్‌కు సంబంధించిన రేంజ్, టోవింగ్ సామర్థ్యం, యాక్సిలరేషన్ వంటి స్పెసిఫికేషన్లపై కచ్చితమైన వివరాలు వెల్లడించలేదు.
అమెరికాలో 69,990 డాలర్ల ధరతో ఎంట్రీ లెవల్ సైబర్‌ట్రక్ యూఎస్ మార్కెట్‌లో ఆదరణ పొందుతున్న ఫోర్డ్ ఎఫ్-150 లైటనింగ్, రివియన్ ఆర్ 1 టీ వంటి ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లతో పోటీ పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్సోస్కెలెటన్, ఆర్మర్డ్ గ్లాస్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సామర్థ్యాలు సైబర్‌ట్రక్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: 'ఎవరూ తప్పించుకోలేరు.. నేనే రెండుసార్లు ఫైన్ కట్టాను'
ఈవీ విభాగంలో టెస్లా ఆధిపత్యాన్ని కొనసాగించడానికి కంపెనీ కొంత కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఆర్థిక అనిశ్చితి, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ హెచ్చుతగ్గులుండడం వాహన తయారీదారులు ధరలకు సంబంధించి పునరాలోచనలో పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో టెస్లా తీసుకున్న నిర్ణయం వినియోగదారులు మరింత సరసమైన ధరలకు కార్లను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.