పార్ట్‌టైమ్‌ జాబ్‌ నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్‌ జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

పార్ట్‌టైమ్‌ జాబ్‌ నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్‌ జాగ్రత్త!

Published Sat, Feb 3 2024 7:12 PM

Techie manager 6 others lose rs 1 crore to online task frauds - Sakshi

ఆన్‌లైన్‌, సైబర్‌ మోసాలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులే కాకుండా బాగా చదువుకున్నవారు, టెక్నాలజీపై అవగాహన ఉండి ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ఈ ఆన్‌లైన్‌ ఫ్రాడ్‌లకు బలవుతున్నారు. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌తో నిలువునా మోసపోయిన ఓ టెకీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

గత ఏడాది ఫిబ్రవరి 11 నుంచి వివిధ ఆన్‌లైన్‌ టాస్క్‌లపేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ సహా ఎనిమిది మందిని ఏకంగా రూ. 1.04 కోట్లకు మోసగించిన ఉదంతానికి సంబంధించి పుణే, పింప్రీ చించ్వాడ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు గురువారం ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశాయి.

 
 
రూ. 30.20 లక్షలు నష్టపోయిన టెకీ
ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రలోని వాకాడ్‌ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గత జనవరి 24 నుంచి 27 తేదీల మధ్య రూ.30.20 లక్షలు నష్టపోయారు. ఇటీవల జాబ్‌ పోవడంతో నిరుద్యోగిగా మారారు. దీంతో ఆన్‌లైన్‌ టాస్క్‌లు పూర్తి చేసే పార్ట్‌టైమ్‌లో చేరారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఆఫర్‌ గురించి జనవరి 24న తన మొబైల్‌ ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనికి స్పందించిన ఆయనకు ఫోన్‌లో మెసెంజర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని చెప్పారు. ఆపై ఆయన్ను ఓ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు, కంపెనీలకు రేటింగ్‌ ఇచ్చే టాస్క్‌లు అప్పగించారు. ఈ టాస్క్‌లు పూర్తి చేశాక రూ.40 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని చెప్పి ముందుగా కొద్దికొద్దిగా టెకీ నుంచి డబ్బు తీసుకున్నారు.

ఇలా జనవరి 24 నుంచి 12 విడతల్లో రూ.30.20 లక్షలు మోసగాళ్లు చెప్పిన బ్యాంక్‌ అకౌంట్లకు బాధితుడు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. కంపెనీకి లాస్‌ వచ్చిందని మళ్లీ కొంత డబ్బు పంపించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను తాను అప్పటిదాకా ట్రాన్స్‌ఫర్‌ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్‌ చేశాడు. దీంతో మోసగాళ్లు అతని స్పందించడం మానేశారు.

 

మేనేజర్‌ రూ.72.05 లక్షలు
ఇదే విధంగా థెర్‌గావ్‌కు చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్‌ యువతి కూడా రూ.2.39 లక్షలు నష్టపోయింది. ఈమే కాకుండా మరో ఆరుగురు కూడా ఆన్‌లైన్‌ టాస్క్‌లతో మోసపోయారు. వీరిలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌ గా పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు. ఆమె ఏకంగా రూ.72.05 లక్షలు నష్టపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement