
టెక్నాలజీ అభివృద్ధి అనేది రెండు వైపులా పదనున్న కత్తిగా వ్యవహరిస్తోందనే వాదనలున్నాయి. ఆర్థికాభివృద్ధి, టెక్ వ్యవస్థలను ముందుకు నడిపేందుకు కొత్త ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడుతుంటే.. దీనివల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. 2025 ప్రథమార్ధం ముగిసిన నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇతర టెక్ దిగ్గజాల్లోని వేలాది మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడమే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.
టాప్ కంపెనీల్లో..
2025 జనవరి-జులై మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 91,000 ఉద్యోగాలను తొలగించగా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ గణనీయంగా తమ సిబ్బందిని తగ్గించాయి. స్టార్టప్‌లు, యునికార్న్‌లతోపాటు ఆధునిక కంప్యూటింగ్‌కు మార్గదర్శకత్వం వహిస్తున్న, కృత్రిమ మేధ రేసులో ముందున్న సంస్థల నుంచి ఈ ఉద్యోగ కోతలు ఎక్కువయ్యాయి.
ఎవరేం చెప్పినా కోతలే ప్రధానం
లాజిస్టిక్స్, ఏడబ్ల్యూఎస్ సపోర్ట్, ఇంటర్నల్ ఆపరేషన్స్ విభాగాల్లో ఇప్పటివరకు అమెజాన్ సుమారు 23,000 ఉద్యోగాలను తగ్గించింది. సేల్స్, కస్టమర్ సపోర్ట్, నాన్ ఏఐ ఆర్ అండ్ డీ విభాగాల్లో 17,500 ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ తొలగించింది. సీఈఓ సత్య నాదెళ్ల ఈ చర్యను ‘తదుపరి తరం ఉత్పాదకత దిశగా శ్రామిక శక్తిని పునర్‌వ్యవస్థీకరించడం’గా అభివర్ణించారు. అడ్వర్టైజింగ్, హెచ్ఆర్, లెగసీ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం టీమ్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా 21,000 ఉద్యోగాలను గూగుల్ తొలగించింది. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్’ విధానంతో కంపెనీ ట్రాన్సఫర్మేషన్‌లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సుందర్ పిచాయ్ తెలిపారు.
ఏఐ ఆర్ అండ్ డీలో పెట్టుబడి
ఈ కోతల వల్ల కంపెనీలకు భారీగా వ్యయం మిగులుతుంది. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం దీన్ని వెచ్చిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు కలిసి 2026 నాటికి ఏఐ ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాలకు 150 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హెడ్ కౌంట్ పడిపోవడంతో కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు పెరిగాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ సంస్థల షేర్ల ధరలు ఇటీవల 18-27 శాతం మధ్య పెరిగాయి.
ఇదీ చదవండి: ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభం
కొన్ని ఉద్యోగాలకు డిమాండ్
ఏఐ పెరుగుతున్నా కొన్ని ఉద్యోగాలకు మాత్రం డిమాండ్ అధికమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్, మోడల్ ట్రైనర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలున్న వారికి కంపెనీలు ఎంతైన వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇటీవల మెటా ప్యాకేజీల వల్ల తెలుస్తుంది. ఏఐ టెక్ నిపుణులకు సుమారు రూ.830 కోట్ల ప్యాకేజీలను సైతం ప్రకటిస్తోంది.