
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పింఛన్లను సవరించే 8వ వేతన సంఘం (సీపీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం ముందస్తు చర్చలు ప్రారంభించింది. 2026 జనవరి 1 నుంచి ఈ కమిషన్ అమల్లోకి రానుంది. పీటీఐ నివేదిక ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.
ఈ సంప్రదింపుల్లో భాగంగా కేంద్రశాఖలతోపాటు రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కోరినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ధ్రువీకరించారు. కమిషన్‌ను అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత ఛైర్‌పర్సన్, సభ్యులను నియమిస్తామని ఆయన పార్లమెంటుకు తెలిపారు.
ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.
ఇదీ చదవండి: ఆర్‌కామ్, అనిల్ అంబానీపై ‘ఫ్రాడ్’ ముద్ర
కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.
గమనిక: 2026 జనవరి నాటికి డీఏ 57 శాతానికి పెరగనుంది. నగర వర్గీకరణ ఆధారంగా హెచ్ఆర్ఏ, టీఏ గణాంకాలు కొద్దిగా మారుతూ ఉంటాయి.