పార్ట్‌టైమ్ టీచర్లతో ఎస్సీ గురుకులాల కీలక అధికారి వెటకారం
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 1,500 మందికి 3 నెలలుగా జీతాల్లేవు
జీతాలివ్వాలని మంత్రి లోకేశ్‌కి ట్వీట్ చేసిన టీచర్లు
దీన్ని నేరంగా భావించి.. వేతనాల విషయం పట్టించుకోని అధికారులు
సాక్షి, అమరావతి: జీతాలిప్పించండి మహోప్రబో... అని మంత్రి లోకేశ్‌కు మొరపెట్టుకున్నందుకు వారికి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా మూడునెలల వేతనాలను ఆపేసింది. 1,500 మందికిపైగా పార్ట్‌టైమ్ టీచర్లు వేతనాల్లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న వీరికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సక్రమంగా వేతనాలు రావడంలేదు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని భావించిన పార్ట్‌టైమ్ టీచర్లు.. జీతం ఇప్పించాలని ఆయన్ని కోరుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతే.. ప్రభుత్వం వారిపై పగబట్టినట్టుగా మూడు నెలలకుపైగా వేతనాలు నిలిపేసింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి జీతాలు ఇవ్వలేదు.
పేరుకే పార్ట్‌టైమ్... పని చేసేది ఫుల్‌టైమ్
పేరుకే పార్ట్‌టైమ్ అయినా ఫుల్‌టైమ్ పనిచేస్తున్నామని, వేతనాలు రాక అవస్థలు పడుతున్నామని కొద్దిరోజుల కిందట అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల పార్ట్‌టైమ్ టీచర్లు ఒక కీలక అధికారిని కలిసి మొరపెట్టుకున్నారు. మీరు పార్ట్‌టైమ్ టీచర్లు మాత్రమే. ప్రభుత్వం జీతం ఇచ్చినప్పుడే తీసుకోవాలి... అని ఆ అధికారి కటువుగా బదులిచ్చారు. మంత్రి లోకేశ్‌కు ట్వీట్ చేశారుగా.. జీతాలు వచ్చినప్పుడే వస్తాయిలే.. అని వెటకారంగా చెప్పారు. ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నామని, ఆ తర్వాత స్టడీ అవర్స్‌కు తప్పనిసరిగా ఉండాల్సి వస్తోందని పార్ట్‌టైమ్ టీచర్లు తెలిపారు.
విద్యార్థుల మొత్తం బాధ్యత, రికార్డుల పర్యవేక్షణతోపాటు రెగ్యులర్ స్టాఫ్ చేసే ప్రతి పనిని తాము కూడా చేస్తున్నప్పటికీ వేతనాలు నెలల తరబడి ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. ఆగస్టు నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో తాము కుటుంబపోషణకు ఇతర ఖర్చులకు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలివ్వాలని, శ్రమ దోపిడీని అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


