అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం.. | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..

Published Fri, May 10 2024 8:00 AM

TCS CEO earns the least among IT firms ceos

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్‌ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.

ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.

కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు,  అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్‌ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్‌ పర్చేజ్‌ స్కీమ్‌ (ESPS) ఉండదు.

2024 ఆ‍ర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement