
స్టాక్ మార్కెట్లో షేర్లను తక్కువ రేటుకు కొనుక్కుని, ఎక్కువ రేటుకు అమ్ముకోవాలనేది సాధారణంగా ప్రతి ఇన్వెస్టరు ధ్యేయంగా ఉంటుంది. ఇది వినడానికి సులభంగానే అనిపించినప్పటికీ, వాస్తవ ప్రపంచంలో దీన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లు ఎటు వెళ్తాయనేది, కచ్చితమైన సమయంలో ఇన్వెస్ట్ చేయడమనేది దాదాపు అసాధ్యమైన విషయం. దీన్నే ‘ఇన్వెస్ట్‌మెంట్ డైలమా’ అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎస్‌ఐఎస్‌వో విధానం (సిస్టమాటిక్ ఇన్, సిస్టమాటిక్ ఔట్– సిసో) ఉపయోగకరంగా ఉంటుంది.
సిసో అంటే మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి పట్టించుకోకుండా ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం, అదే విధంగా క్రమపద్ధతిలో వెనక్కి తీసుకోవడం. యులిప్స్‌లాంటి జీవిత బీమా పథకాలకు ఈ విధానాన్ని జోడించడం ద్వారా జీవిత బీమా కవరేజీతో పాటు దీర్ఘకాలంలో సంపద సృష్టి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఉదాహరణకు తొలి దశలో ‘సిస్టమాటిక్ ఇన్’ కింద మీరు ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం వల్ల యూనిట్ల సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. యూనిట్ విలువ (ఎన్‌ఏవీ) మారే కొద్దీ మీరు పెట్టే పెట్టుబడికి ఒకసారి యూనిట్లు పెరగొచ్చు మరోసారి తగ్గొచ్చు. దీని వల్ల అంతిమంగా సగటు రేటు తగ్గుతుంది. ఇక పోగుపడిన మొత్తాన్ని, పిల్లల చదువు కోసమో లేక రిటైర్మెంట్ అవసరాల కోసమో లేక మరో దాని కోసమో వెనక్కి తీసుకోవాల్సిన సమయం తర్వాతెపుడో వస్తుంది. అప్పుడు సిస్టమాటిక్ ఔట్ .. అంటే ఒక క్రమపద్ధతిలో వెనక్కి తీసుకుంటే స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుంది.
బీమాకు ‘సిసో’..
సాధారణంగా జీవిత బీమా అంటే భద్రత మాత్రమే కల్పించే సాధనంగా పరిగణిస్తారు. కానీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలాంటివి (యులిప్‌లు) ఇటు పెట్టుబడి వృద్ధి అటు జీవితానికి కవరేజీ.. ఇలా రెండింతల ప్రయోజనాలు కల్పిస్తాయి. సిసో వ్యూహంతో సంపద సృష్టి సాధనంగా కూడా ఇవి పని చేస్తాయి. సంపద పోగు చేసుకునే దశలో మీ ప్రీమియంలను ఈక్విటీ, డెట్ లేదా మీ రిస్కు సామర్థ్యాలు, పెట్టుబడి లక్ష్యానికి తగ్గట్లుగా ఉండే కాంబినేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అదే సమయంలో మీపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ఆర్థిక భద్రత లభించేలా జీవిత బీమా కవరేజీని కూడా అందిస్తాయి.
మీరు మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు మీకు రావాల్సిన చెల్లింపులను సిస్టమాటిక్ ఔట్ విధానం కింద క్రమానుగతంగా పొందేలా ఎంచుకుంటే.. స్థిరంగా ఆదాయాన్ని అందుకోవచ్చు. ఆర్థిక స్వాతంత్య్రం అనేది ఏదో సంక్లిష్టమైన బ్రహ్మపదార్థం కాదు. సిసో వ్యూహం అలాగే తగిన జీవిత బీమా పథకంతో మీరు లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. మార్కెట్ ప్రతి కదలికను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం లేకుండా ఆర్థిక ప్రణాళిక పట్టాలు తప్పకుండా చూసుకోవచ్చు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!