breaking news
ulip
-
యులిప్‌లు... ఇప్పుడు చూడొచ్చు!
ఒకప్పుడు యూనిట్ లింక్డ్ బీమా ప్లాన్లంటే (యులిప్) యమా క్రేజ్ ఉండేది. కారణం... ఇవి బీమా రక్షణ ఇస్తాయి. అంతేకాక స్టాక్ మార్కెట్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ రెండూ కలిసిన ఉత్పత్తులేవీ అప్పట్లో మార్కెట్లో అందుబాటులో లేకపోవటంతో వీటివంక జనం ఆకర్షితులయ్యేవారు. కాకపోతే ఇలా ఆకర్షితులు కావటానికి అప్పట్లో తప్పుదోవ పట్టించే గణాంకాలు కూడా ఒక కారణమే!!. అధిక కమీషన్లు, అధిక చార్జీల విషయాన్ని ఏజెంట్లు పెద్దగా వివరించేవారు కాదు. ఫలితం... ఎన్నాళ్లు గడిచినా ఇవి సరైన లాభాలివ్వలేదు. దీంతో చాలామంది నష్టాల్లోనే వీటిని వదిలించుకున్నారు. ఆసక్తి లేకున్నా కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తిరిగి ప్రవేశపెట్టడంతో మళ్లీ యులిప్‌లు వెలుగులోకి వచ్చాయి. అందుకే... యులిప్‌ల లాభ, నష్టాలపై నిపుణుల అభిప్రాయాలను అందిస్తోంది ‘సాక్షి’.. పర్సనల్ ఫైనాన్స్ విభాగం.... గతంలో చేదు అనుభవాలు... గతంలో యులిప్‌ల డిస్ట్రిబ్యూటర్లకు అధిక కమీÙన్లు చెల్లించారు. దీంతో కమిషన్ కోసం ఏజెంట్లు, డీలర్లు ఆయా ఉత్పత్తుల అవసరం లేని వారికి, మార్కెట్ రిస్క్ భరించలేని వారికి కూడా అందమైన మాటలు చెప్పి బలవంతంగా చేర్పించారు. అలా చేరినవారంతా యులిప్‌లపై వ్యతిరేకతను పెంచుకున్నారు. 2008–09 ఆర్థిక సంక్షోభం తర్వాత మార్కెట్ల పతనం, ఆ తర్వాత 2010లో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) మార్గదర్శకాలతో పరిస్థితి మారిపోయింది. బీమా కంపెనీల నూతన పాలసీల్లో యులిప్‌ల వాటా 2010 మార్చి నాటికి 55 శాతంగా ఉండగా, 2017 డిసెంబర్ నాటికి 12 శాతానికి క్షీణించింది. ఇప్పుడు రూపం మారింది... యులిప్ పాలసీల్లో ఆ తర్వాత కాలంలో కొన్ని మార్పులు జరిగాయి. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి, బీమా, పెట్టుబడి కలగలసిన పథకాలుగా, తక్కువ చార్జీలతో ఆకర్షణీయంగా మారాయి. ముఖ్యంగా ప్రీమియం అలొకేషన్ చార్జీలు, డిస్ట్రిబ్యూటర్ల కమీషన్లు తగ్గాయి. మధ్యలో పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీలను కొన్ని కంపెనీలు పెంచగా, కొన్ని కంపెనీలు వాటికి దూరంగా ఉన్నాయి. మోర్టాలిటీ చార్జీలు తిరిగి చెల్లించడం, లాయల్టీ అడిషన్ రూపంలో ఇన్వెస్టర్లను ఆకర్షించటం వంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక 2018–19 ఆర్థిక బడ్జెట్లో ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎల్టీసీజీ పన్ను వేయడంతో యులిప్‌లకు మళ్లీ ఆదరణ మొదలైంది. కారణం... బీమా పాలసీలు కనక వీటికి పన్ను మినహాయింపులున్నాయి. పైగా యులిప్‌లలో ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీలకు పెట్టుబడులు మార్చుకు న్నా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలా చేస్తే మా త్రం పన్ను చెల్లించాలి. ఇక పన్ను ఆదాకు ఉద్దేశించిన ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ప్రతీ సిప్కూ మూడేళ్లు కాల వ్యవధి పూర్తవ్వాలి. అలా అయ్యాకే రిడీమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే యులిప్‌లలో అయితే ఐదేళ్లు పూర్తయిన తర్వాత మొత్తం పెట్టుబడులను ఒకేసారి వెనక్కి తీసేసుకోవచ్చు. ఆన్లైన్ యులిప్ పాలసీల్లో చార్జీలు చాలా తక్కువ. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం యులిప్ ప్లాన్లు రాబడుల అంచనాలను 4 శాతం, 8 శాతం కంటే ఎక్కువ చేసి చూపించకూడదు. అందుకని మెచ్యూరిటీ వ్యాల్యూను అంచనా వేసే ముందు ఆయా ప్లాన్ల ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ చూడాల్సి ఉంటుందనేది నిపుణుల మాట. ఇది దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు కల్పిస్తుంది. కొన్ని పరిమితులు ఇప్పటికీ... సౌకర్యం పరంగా చూస్తే యులిప్‌ల కంటే మ్యూచువల్ ఫండ్స్ ముందుంటాయి. ఫండ్ పనితీరు నచ్చకపోతే ఈఎల్ఎస్ఎస్ మినహా మిగిలిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాలు ఏవయినా వెంటనే వెదొలగవచ్చు. యులిప్‌ల్లో ఈ అవకాశం లేదు. అలాగే, ఫండ్ పనితీరు నచ్చకపోతే వెంటనే సిప్ ఆపేసి మరో మంచి పథకం ఎంచుకోవచ్చు. ఆ విధంగా చూసినా యులిప్‌లలో తొలి ఐదేళ్లు ప్రీమియం చెల్లించకుండా ఆపడానికి లేదు. ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఐదేళ్ల తర్వాత పాలసీని సరెం డర్ చేయాలన్నా అది యాక్టివ్‌గా ఉండాలి. కనుక ఐదేళ్లలోపు డబ్బులు అవసరం అనుకునే వారికి యులిప్‌లు సరికాదు. 5–7 ఏళ్ల మధ్య డబ్బుతో పనిలేదనుకుంటే ఇబ్బంది ఉండదు. ఫండ్స్ అయినా, యులిప్‌లు అయినా రెండూ మార్కెట్ ఆధారిత పెట్టుబడి సాధనాలే. ఈక్విటీల్లో పెట్టుబడి ఆప్షన్ ఎంచుకునే వారికి రిస్క్ భరించే సామర్థ్యం ఉండాలి. ఒకవేళ డెట్ ఫండ్స్ ఎంచుకుంటే రాబడుల విషయంలో కాస్త రాజీ పడాల్సి ఉంటుంది. ముందుగా తప్పుకుంటే... యులిప్ ప్లాన్లలో ఒకసారి చేరిన వారు కనీసం ఐదేళ్లు కొనసాగితేనే పన్ను ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆలోపు తప్పుకోవాలనుకుంటే అప్పటి వరకు పొందిన పన్ను మినహాయింపులు తిరిగి అమల్లోకి వస్తాయి. అంటే ఐదేళ్లలోపు పాలసీని డిస్కంటిన్యూ చేస్తే అప్పటి వరకు పొందిన పన్ను ప్రయోజనాల మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరంలో పాలసీదారుడు తన ఆదాయానికి కలిపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాలున్నాయి... పన్ను పరంగా చూసుకుంటే యులిప్లే నయం. యులిప్‌లలో నాన్ ఈక్విటీ ఫండ్స్ మూడేళ్ల తర్వాత ద్రవ్యోల్బణం ప్రభావం మిననహాయించుకునే ఆప్షన్‌కు అర్హమైనవే. ఒకవేళ యులిప్‌లలో డెట్ ఫండ్స్ రాబడులు ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉంటే నష్టాలను చూపించుకుని, ఇతర పన్ను వర్తించే ఆదాయాన్ని నష్టాల కింద సర్దుబాటు చేసుకోవచ్చు. లేదా ఆ నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చని ట్యాక్స్‌స్పానర్ వ్యవస్థాపకుడు సుధీర్కౌషిక్ చెప్పారు. యులిప్‌లలో చార్జీలు తక్కువగా ఉన్నప్పటికీ, చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్లు మ్యూచువల్ ఫండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ విడిగా తీసుకోవాలని సూచించే విషయం తెలిసే ఉంటుంది. నిజంగా బీమా రక్షణ కోసమే అయితే టర్మ్ ప్లాన్లకు సాటి వచ్చేవి లేవని ఆప్టిమా మనీ మేనేజర్స్ సంస్థ సీఈవో పంకజ్ మథ్పాల్ తెలియజేశారు. యులిప్‌లు బీమా ప్లాన్లు. ఇందులో వచ్చే రాబడులపై సెక్షన్ 10(10డి) కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, వార్షిక ప్రీమియానికి కవరేజీ 10 రెట్ల వరకే ఇది. చెల్లించే ప్రీమియానికి సెక్షన్ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది కూడా వార్షిక ప్రీమియానికి బీమా కవరేజీ పది రెట్లు ఉండటం అవసరం. ఒకవేళ సమ్ అష్యూరెన్స్ (కవరేజీ)లో చెల్లించే ప్రీమియం 10 శాతానికి మించి ఉంటే పన్ను మినహాయింపు 10 శాతానికే పరిమితం అవుతుంది. ఒకవేళ అనారోగ్యం, వైకల్యాలతో బాధపడేవారికి బీమా కవరేజీలో 15 శాతం మినహాయింపు అమలవుతుంది. గడువు తీరిన తర్వాత వచ్చే మెచ్యూరిటీపై లేదా పాలసీదారుడు మరణించినట్టయితే చెల్లించే పరిహారంపైనా పన్ను ఉండదు. -
బీమా వద్దనుకుంటే.. యులిప్ కూడా వద్దు
నేను ఏడాది క్రితం ఒక ఎఫ్ఎంపీ(ఫిక్స్డ్ మెచ్యురిటీ ప్లాన్)లో రూ.30,000 ఇన్వెస్ట్ చేశాను. అది ఈ నెలలో మెచ్యూర్ అవుతోంది. ఈ డబ్బులు తీసుకోమంటారా? లేక మరో రెండేళ్లు పొడిగించమంటారా? ఇప్పుడే డబ్బులు తీసుకుంటే షార్ట్ టెర్మ్గెయిన్స్ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని మిత్రులంటున్నారు. ఈ పన్ను కట్టే ఇబ్బంది లేకుండా నాకు మంచి రాబడులు రావాలి ? ఏం చేయమంటారు ? తగిన సూచనలివ్వండి. - సురేంద్ర, వరంగల్ ఈ ఏడాది బడ్జెట్ నుంచి డెట్ ఫండ్స్ పన్ను నియమాల్లో మార్పులు వచ్చాయి. ఈ ఏడాది జూలై 11 నుంచి ఈ కొత్త పన్ను నిబంధనలు అమల్లోకి వస్తాయి. మూడేళ్లలోపు డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన లాభాలను షార్ట్‌టెర్మ్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. వీటిపై వచ్చిన లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. బడ్జెట్‌కు ముందు చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా ఇదే నియమాలు వర్తిస్తాయి. ఎఫ్ఎంపీలను పొడిగించుకోవడానికి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అనుమతిస్తున్నాయి. ఇక మీ విషయానికొస్తే, మీకు ఇప్పుడు డబ్బులు అవసరం లేకపోతే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరో రెండేళ్లు పొడిగించండి. మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుం టే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉండదు. నా వయస్సు 45 సంవత్సరాలు. 2007 ఆగస్టులో కోటక్ హెడ్‌స్టార్ట్ ఫ్యూచర్ ప్రొటెక్ట్ యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఈ యులిప్ కాలపరిమితి పదేళ్లు. ఇప్పటిదాకా రూ.1,50,000 ఇన్వెస్ట్ చేశాను. ప్రస్తుతం ఈ యులిప్ విలువ రూ.2,02,000. నా కొడుకు విద్యావసరాల నిమిత్తం అప్పట్లో ఈ యులిప్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ విద్యావసరాలకు వేరే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? లేకుంటే మెచ్యూరిటీ వరకూ ఆగమంటారా? రెండింటిలో ఏది ఉత్తమం? - భవానీ, విశాఖ పట్టణం సాధారణంగా యులిప్‌లు లాభాల్లో ఉండవు. కానీ మీ యులిప్ లాభాల్లో ఉండడం విశేషం. అయితే 7 ఏళ్ల కాలానికి మీకు వచ్చిన రాబడులు తక్కువగా ఉన్నాయి. మీరు ఈ పాలసీ తీసుకొని ఏడేళ్లు పూర్తయింది కాబట్టి, మీరు ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా 100% ఫండ్ వాల్యూ మీకు అందుతుంది. మీ కొడుకు విద్యావసరాలకు వేరే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నందున మీ యులిప్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవడమే ఉత్త మం. ఈ యులిప్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వాటిని ప్రస్తుతం మీ అబ్బాయి విద్యావసరాల నిమిత్తం ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలిక ట్రాక్ రికార్డ్ ఆధారంగానే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. నేనొక యులిప్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీర్ఘకాల మూలధన వృద్ధి లక్ష్యంగా ఈ యులిప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ యులిప్ బీమా ను కూడా ఆఫర్చేస్తోంది. అయితే నాకు ఎలాంటి బీమా అవసరం లేదు. దానికి వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. యులిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాకపోతే నా ఆర్థిక లక్ష్యానికి తగ్గట్లుగా నాకొక ఫండ్‌ను సూచించండి. - ఆసిఫ్, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్‌లా కాకుండా యులిప్‌ల రాబడులు ఇన్వెస్టర్లపై విధించే చార్జీలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కో యులిప్కు విధంగా వ్యయాల తీరు ఉంటుంది. ఒక్కో యులిప్ రకరకాలైన చార్జీలను వసూలు చేస్తున్నాయి. మీకు బీమా అవసరం లేకపోతే యులిప్‌ల్లో కాకుండా మ్యూచువల్ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో లార్జ్‌క్యాప్ కానీ, మిడ్‌క్యాప్ ఫండ్స్‌ల్లో కానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు. అంతేకాకుండా బీఎన్పీ పారిబా డివిడెండ్ ఈల్డ్, టాటా డివిడెండ్ ఈల్డ్ వంటి మల్టీ క్యాప్ ఫండ్ల్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు.