బీమా వద్దనుకుంటే.. యులిప్ కూడా వద్దు | if don't want the insurance also do not ulip | Sakshi
Sakshi News home page

బీమా వద్దనుకుంటే.. యులిప్ కూడా వద్దు

Sep 22 2014 12:38 AM | Updated on Apr 4 2019 5:22 PM

నేను ఏడాది క్రితం ఒక ఎఫ్‌ఎంపీ(ఫిక్స్‌డ్ మెచ్యురిటీ ప్లాన్)లో రూ.30,000 ఇన్వెస్ట్ చేశాను.

నేను ఏడాది క్రితం ఒక ఎఫ్‌ఎంపీ(ఫిక్స్‌డ్ మెచ్యురిటీ ప్లాన్)లో రూ.30,000 ఇన్వెస్ట్ చేశాను. అది ఈ నెలలో మెచ్యూర్ అవుతోంది. ఈ డబ్బులు తీసుకోమంటారా? లేక మరో రెండేళ్లు పొడిగించమంటారా? ఇప్పుడే డబ్బులు తీసుకుంటే షార్ట్ టెర్మ్‌గెయిన్స్‌ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని మిత్రులంటున్నారు. ఈ పన్ను కట్టే ఇబ్బంది లేకుండా నాకు మంచి రాబడులు రావాలి ?  ఏం చేయమంటారు ?  తగిన సూచనలివ్వండి. - సురేంద్ర, వరంగల్
 ఈ ఏడాది బడ్జెట్ నుంచి డెట్ ఫండ్స్ పన్ను నియమాల్లో మార్పులు వచ్చాయి. ఈ ఏడాది జూలై 11 నుంచి ఈ కొత్త పన్ను నిబంధనలు అమల్లోకి వస్తాయి. మూడేళ్లలోపు డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన లాభాలను షార్ట్‌టెర్మ్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. వీటిపై వచ్చిన లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. బడ్జెట్‌కు ముందు చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా ఇదే నియమాలు వర్తిస్తాయి. ఎఫ్‌ఎంపీలను పొడిగించుకోవడానికి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అనుమతిస్తున్నాయి. ఇక మీ  విషయానికొస్తే, మీకు ఇప్పుడు డబ్బులు అవసరం లేకపోతే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరో రెండేళ్లు పొడిగించండి. మూడేళ్ల తర్వాత  మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుం టే మీరు  ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉండదు.

 నా వయస్సు 45 సంవత్సరాలు. 2007 ఆగస్టులో కోటక్ హెడ్‌స్టార్ట్ ఫ్యూచర్ ప్రొటెక్ట్ యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లో ఇన్వెస్ట్ చేయడం  ప్రారంభించాను.  ఈ యులిప్ కాలపరిమితి పదేళ్లు. ఇప్పటిదాకా రూ.1,50,000 ఇన్వెస్ట్ చేశాను. ప్రస్తుతం ఈ యులిప్ విలువ రూ.2,02,000. నా కొడుకు విద్యావసరాల నిమిత్తం అప్పట్లో ఈ యులిప్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ విద్యావసరాలకు వేరే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? లేకుంటే మెచ్యూరిటీ వరకూ ఆగమంటారా? రెండింటిలో ఏది ఉత్తమం? - భవానీ, విశాఖ పట్టణం
 సాధారణంగా యులిప్‌లు లాభాల్లో ఉండవు. కానీ మీ యులిప్ లాభాల్లో ఉండడం విశేషం. అయితే 7 ఏళ్ల కాలానికి మీకు వచ్చిన రాబడులు తక్కువగా ఉన్నాయి. మీరు ఈ పాలసీ తీసుకొని ఏడేళ్లు పూర్తయింది కాబట్టి, మీరు ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా 100% ఫండ్ వాల్యూ మీకు అందుతుంది. మీ కొడుకు విద్యావసరాలకు వేరే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నందున మీ యులిప్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవడమే ఉత్త మం. ఈ యులిప్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వాటిని ప్రస్తుతం మీ అబ్బాయి విద్యావసరాల నిమిత్తం ఇన్వెస్ట్ చేస్తున్న  మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలిక ట్రాక్ రికార్డ్ ఆధారంగానే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి.

 నేనొక యులిప్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీర్ఘకాల మూలధన వృద్ధి లక్ష్యంగా ఈ యులిప్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను.  ఈ యులిప్ బీమా ను కూడా ఆఫర్‌చేస్తోంది. అయితే నాకు ఎలాంటి బీమా అవసరం లేదు. దానికి వేరే ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. యులిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాకపోతే నా ఆర్థిక లక్ష్యానికి తగ్గట్లుగా నాకొక ఫండ్‌ను సూచించండి.  - ఆసిఫ్, హైదరాబాద్
 మ్యూచువల్ ఫండ్స్‌లా కాకుండా యులిప్‌ల రాబడులు ఇన్వెస్టర్లపై విధించే చార్జీలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కో యులిప్‌కు విధంగా వ్యయాల తీరు ఉంటుంది. ఒక్కో యులిప్ రకరకాలైన చార్జీలను వసూలు చేస్తున్నాయి. మీకు బీమా అవసరం లేకపోతే యులిప్‌ల్లో కాకుండా మ్యూచువల్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో లార్జ్‌క్యాప్ కానీ, మిడ్‌క్యాప్  ఫండ్స్‌ల్లో కానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ ఫండ్‌లను పరిశీలించవచ్చు. అంతేకాకుండా  బీఎన్‌పీ పారిబా డివిడెండ్  ఈల్డ్, టాటా డివిడెండ్ ఈల్డ్ వంటి మల్టీ క్యాప్ ఫండ్‌ల్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement