
Suzuki Hayabusa Anniversary Edition: సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా' (Hayabusa) అని అందరికి తెలుసు. అయితే సంస్థ ఇప్పుడు ఇందులో ఒక కొత్త ఎడిషన్ విడుదల చేయడానికి సర్వత్రా సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మార్కెట్లో 25 సంవత్సరాల నుంచి అమ్మకానికి ఉన్న హయబుసా గుర్తుగా కంపెనీ 25వ యానివెర్సరీ ఎడిషన్ విడుదల చేయడానికి తయారైంది. ఇందులో భాగంగానే హమామట్సు (Hamamatsu) ఆధారిత మార్క్యూ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఆవిష్కరించింది. సంస్థ ఈ బైక్ అమ్మకాలను ఈ నెల నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించే అవకాశం ఉంది.
దేశీయ విఫణిలో అందుబాటులోకి రానున్న కొత్త హయాబుసా స్పెషల్ ఎడిషన్ ఆరెంజ్/బ్లాక్ పెయింట్, డ్రైవ్ చైన్ అడ్జస్టర్ వంటి బిట్‌ల కోసం ప్రత్యేకమైన యానోడైజ్డ్ గోల్డ్ కలర్ పొందుతుంది. కంజి లోగో, ట్యాంక్ మీద త్రీ-డైమెన్షనల్ సుజుకి లోగో వంటివి చూడవచ్చు. సింగిల్ సీట్ కౌల్ ప్రామాణికంగా లభిస్తుంది.
సుజుకి హయాబుసా పవర్‌ట్రెయిన్ & ఎలక్ట్రానిక్స్
హయబుసా స్పెషల్ ఎడిషన్ అదే లిక్విడ్ కూల్డ్ 1340సీసీ ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి 190 hp పవర్, 150 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో లభిస్తుంది. రైడింగ్ మోడ్‌లు, పవర్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్ కూడా చాలా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి.
(ఇదీ చదవండి: రైల్వే స్టేషన్‌లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?)
అంచనా ధర & ప్రత్యర్థులు
సుజుకి హయబుసా యానివెర్సరీ ఎడిషన్ అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విక్రయానికి రానుంది. భారతీయ మార్కెట్లో అధికారికంగా ఎప్పుడు విడుదలవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు, సాధారణ హయబుసా ధర రూ. 16.90 లక్షలు, కావున స్పెషల్ ఎడిషన్ ధర అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.