డిజిటల్‌ అరెస్ట్‌ల నిరోధానికి  పరిష్కారాలు చూడండి  | Sitharaman ask fintechs to find solutions to prevent digital arrests, cyber frauds | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ అరెస్ట్‌ల నిరోధానికి  పరిష్కారాలు చూడండి 

Jun 20 2025 5:39 AM | Updated on Jun 20 2025 9:32 AM

Sitharaman ask fintechs to find solutions to prevent digital arrests, cyber frauds

ఫిన్‌టెక్‌లకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ పిలుపు 

ఎంఎస్‌ఎంఈలకూ రుణాలందించాలని సూచన

న్యూఢిల్లీ: డిజిటల్‌ అరెస్ట్‌లు, ఇతర సైబర్‌ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో వీటికి కళ్లెం వేసేందుకు సరైన పరిష్కారాలతో ముందుకు రావాలని ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో, మారుమూల ప్రాంతాలకూ చెల్లింపుల సేవలను విస్తరించడంలో ఫిన్‌టెక్‌లు పోషించిన పాత్రను ఆమె ప్రశంసించారు. డిజిటల్‌ పేమెంట్స్‌ అవార్డ్స్‌ 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. 

ఇంట్లోనే ఉన్నవారిని డిజిటల్‌గా అరెస్ట్‌ చేయకుండా లేదా నైట్‌ ఆపరేటర్ల ద్వారా డబ్బులు మోసపోకుండా పరిష్కారాలతో ముందుకు రావాలని స్టార్టప్‌లను కోరారు. ప్రజలకు మరింత నష్టం కలిగిస్తున్న డీప్‌ఫేక్‌ (నకిలీ)ను అతిపెద్ద ముప్పుగా అభివరి్ణంచారు. కొత్తగా ఎదురయ్యే సవాళ్లకు తగిర పరిష్కారాలను కనుగొని, వాటిని అందించే ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ల అవసరం ఎంతో ఉందన్నారు. 

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) రుణ సదుపాయాలను విస్తరించాలని ఫిన్‌టెక్‌లను కోరారు. ఫిన్‌టెక్‌ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల వినియోగ వస్తువులుగా మారాలంటూ.. అవి ఇతర వర్ధమాన, అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలకు సైతం ప్రయోజనం కలిగిస్తాయన్నారు. మన సంస్థలకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయని చెప్పారు. ‘‘విజయవంతమైన నమూనాలను విదేశాలకు తీసుకెళ్లాలి. 

అంతర్జాతీయ మార్కెట్లను సొంతం చేసుకోవాలి. మనకు నైపుణ్యాలున్నాయి. పెద్ద మార్కెట్‌తోపాటు రుజువైన పరిష్కారాలూ ఉన్నాయి’’అని మంత్రి వివరించారు. ప్రపంచంలో ప్రస్తుతం రోజువారీ జరుగుతున్న డిజిటల్‌ల లావాదేవీల్లో సగం భారత్‌లోనే ఉంటున్న విషయాన్ని ప్రస్తావించారు. దేశ ఫిన్‌టెక్‌ పరిశ్రమ 2028–29 నాటికి 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఎంతో దూరంలో లేదంటూ.. అవకాశాలకు ఆకాశమే హద్దన్నట్టు మంత్రి చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement