
భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్‌మార్క్ సంఖ్యతో హాల్‌మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్‌మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.
అమలు: 2025 సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ ప్రవేశపెట్టనున్నారు.
స్వచ్ఛత గ్రేడ్‌లు: వెండి ఆభరణాల కోసం బీఐఎస్ 900, 800, 835, 925, 970, 990 అనే ఆరు స్వచ్ఛత గ్రేడ్‌లను పేర్కొంది.
హాల్‌మార్కింగ్ ప్రక్రియ: హాల్‌మార్కింగ్ ప్రక్రియలో వెండి ఆభరణాలకు ఆరు అంకెల HUID అందించడం జరుగుతుంది. ఈ నెంబర్ దాని ప్రామాణికత, స్వచ్ఛతను సూచిస్తుంది.
ఉపయోగం: వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్ 'వెరిఫై HUID' ఫీచర్‌ను ఉపయోగించి.. హాల్‌మార్క్ చేసిన ఆభరణాల ప్రామాణికతను ధృవీకరించవచ్చు. హాల్‌మార్కింగ్ వల్ల నకిలీ లేదా కల్తీ వెండి ఉత్పత్తులను కనిపెట్టవచ్చు. తద్వారా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.
హాల్‌మార్కింగ్ అంటే.. బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్‌మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.
ఇదీ చదవండి: బంగారంపై సుంకం లేదు: డొనాల్డ్ ట్రంప్