ఐటీ, ఆటో, ఫార్మా షేర్ల పరుగులు | Sakshi
Sakshi News home page

ఐటీ, ఆటో, ఫార్మా షేర్ల పరుగులు

Published Fri, Nov 17 2023 7:28 AM

Sensex Gains 307 Pts, Nifty Closes Above 19,750 - Sakshi

ముంబై: ఐటీ, ఆటో, ఫార్మా, వినిమయ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు రెండో రోజూ లాభాలు ఆర్జించాయి. విదేశీ ఇన్వెస్టర్ల తాజా కొనుగోళ్లు, అమెరికా ద్రవ్యోల్బణ దిగిరావడం, బాండ్లపై రాబడులు తగ్గుదల పరిణామాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 307 పాయింట్లు పెరిగి 65,982 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 90 పాయింట్లు బలపడి 19,765 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దేశీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో నష్టాలు అ«ధిగమించి లాభాల బాటపట్టాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 682 పాయింట్లు ర్యాలీ చేసి 66,358 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు ఎగసి 19,875 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ట్రేడింగ్‌ చివర్లో మరోసారి అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సూచీల లాభాలు కొంతమేర తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి.

ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డుల ద్వారా రుణాల జారీ, పంపిణీలను తక్షణమే నిలిపివేయాలంటూ ఆర్‌బీఐ ఆదేశాలతో బజాబ్‌ ఫైనాన్స్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలో 4% నష్టపోయి రూ.6937 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు, ఈక్విటీ మార్కెట్‌ ర్యాలీ అంశాలు కలిసిరావడంతో షేరు బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. ట్రేడింగ్‌ నష్టాలు భర్తీ చేసుకొని చివరికి 2% లాభంతో రూ.7366 వద్ద స్థిరపడింది. 

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు సన్నగిల్లడంతో ఎగుమతి ఆధారిత రంగ ఐటీ షేర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. బీఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ రెండున్నర శాతం ర్యాలీ చేసింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో టీసీఎస్‌(3%), హెచ్‌సీఎల్‌టెక్‌(2.80%), టెక్‌ మహీంద్రా(2.70%), 
ఇన్ఫోసిస్‌(2.50%)లు తొలి నాలుగు స్థానాలు 
దక్కించుకున్నాయి.

టాటా టెక్నాలజీస్‌  ః రూ. 475–500 
ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, డిజిటల్‌ సొల్యూషన్స్‌ అందించే ఇంజినీరింగ్‌ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో ఐపీవో ఈ నెల 22న ప్రారంభంకానుంది. 24న ముగియనున్న ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్, ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌తోపాటు.. ప్రస్తుత వాటాదారు సంస్థలు అల్ఫా టీసీ హోల్డింగ్స్, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌–1 మొత్తం 6.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా దాదాపు రూ. 3,043 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తదుపరి డైవర్సిఫైడ్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న తొలి పబ్లిక్‌ ఇష్యూ ఇదికాగా.. ఇంతక్రితం 2004లో టీసీఎస్‌ లిస్టయ్యింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 

Advertisement
Advertisement